యోగా చేయకపోతే  ముంబై ఆస్పత్రికి వెళ్లాసొస్తుంది

లాలూపై సుశీల్‌ మోదీ వ్యంగ్యాస్త్రాలు
పాట్నా, జూన్‌21(జ‌నం సాక్షి) : నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీఎం నితీశ్‌ కుమార్‌ యోగా డేలో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీ మాత్రం నితీశ్‌ కుమార్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆయనతో పాటు చాలామంది బీజేపీ మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి రాలేదనీ.. అయినంత మాత్రాన వారంతా యోగాకు వ్యతిరేకమని భావించరాదని అయన పేర్కొన్నారు. జేడీయూ నుంచి కూడా డజనుకు పైగా నేతలు యోగా డే కార్యక్రమానికి వచ్చారన్నారు. యోగా డేలో జేడీయూ పాల్గొనలేదన్న ప్రశ్నకు డిప్యూటీ సీఎం స్పందిస్తూ.. ‘ఆర్జేడీ, జేడీయూకి చెందినంత మాత్రాన వారు యోగా చేయకుండా ఉంటారా? అందరూ ఇక్కడికే వచ్చి యోగా చేయాలని లేదుకదా..?’ అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పనిలో పనిగా ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌పైనా సుశీల్‌ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నితీశ్‌ ప్రతిరోజూ యోగా చేస్తారని నాకు తెలుసు. అయితే యోగా చేయనివాళ్లు మాత్రం ముంబై ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది…’ అని వ్యాఖ్యానించారు. దాణా కుంభకోణం కేసుల్లో మొత్తం 27 ఏళ్లు జైలు శిక్ష ఎదుర్కొంటున్న లాలూ… ఆరోగ్యసమస్యల కారణంగా బెయిల్‌పై బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఏషియన్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్నారు.