” రక్తదానంతో మరొకరికి ప్రాణదానం – శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 27( జనంసాక్షి): అవకాశం వచ్చిన ప్రతిసారి రక్తదానం చేయాలని తద్వారా ఆపదలో ఉన్నవారికి ఆ రక్తము ఉపయోగపడి వారికి ప్రాణదానం జరిగే అవకాశం ఉంటుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవ కార్యక్రమాలలో భాగంగా శనివారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బస్ డిపోలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుకోని ప్రమాదాలు, ఆకస్మిక వ్యాధులబారిన పడినప్పుడు సదరు వ్యక్తులకు అవసరమవుతుందని, ఇలాంటి వారికి రక్తం అందించడంద్వారా వారికి జీవనాధారాన్ని కల్పించిన వారమవుతామన్నారు. స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల నేపథ్యంలో  హెచ్.సి.యు బస్ డిపోలో మెగా రక్తదానకార్యక్రమం ఏర్పాటుచేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని, కావున యువత రక్తదానం కార్యక్రమంలో పాల్గొని  ప్రధానం చేయాల్సిన అవసరము ఎంతైనా ఉందన్నారు. ‘రక్తదానం చేయండి – ప్రాణదాతలుగా నిలవండి’ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ విస్తృత ప్రచారంతో ముందుకు వెళ్లి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రక్తదానంచేసి ఇతరుల ప్రాణానికి భరోసాను కల్పించాలని రాగం పిలుపునిచ్చారు. రక్తదానంతో  మరొకరికి జీవితాన్ని బహుమతిగా ఇవ్వాలని భావించి బృహత్తర సేవాకార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు నిర్వహితులను రాగం అభినందించడం జరిగింది. స్నేహితుల నుంచి కుటుంబ సభ్యుల వరకు, ఎవరైనా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని రాగం కోరారు. కొండాపూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రాణాపాయస్థితిలో ఉన్నవారిని ఆదుకోవడం కోసం ఆరోగ్యవంతులైనవారందరూ  రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కార్పొరేటర్ పునరుద్ఘాటించారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వారిని హెచ్.సి.యు బస్సు డిపో యజమాన్యాన్ని, సిబ్బందిని కార్పొరేటర్ కొనియాడారు. మెగా రక్తదాన శిబిరంలో భాగస్వాములై, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రక్తదానం చేయుటకు ముందుకు వచ్చిన వారికి ప్రశంస పత్రం అందజేస్తూ వారందరినీ కూడా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాలతి, డాక్టర్ విరోనిక, HCU DM P. శ్రీనివాస్, AM (T) రామయ్య, MF P. పండరి, ADC సురేందర్, బసవరాజు లింగాయత్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, హెచ్.సి.యు డిపో ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.