రఘునందన్‌ మళ్లీ అవే ఆరోపణలు

హైదరాబాద్‌, మే17 (ఆర్‌ఎన్‌ఎ) :
టీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కృతుడైన రఘునందన్‌రావు మళ్లీ అవే ఆరోపణలు గుప్పించాడు. తనను పార్టీ నుంచి అకారణంగా బహిష్కరించినందుకు 48 గంటల్లో వివరణ ఇవ్వాలన్న గడువు ముగిసినందున ఇక న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ నేతలకు ఇచ్చిన 48 గంటల సమయం గడిచిపోయిందని, ఒక్క ఆధారంతో కూడా వారు రాలేదని ఆయన చెప్పారు. ఇప్పటివరకు పొరపాటును సరిదిద్దుకుంటారని చూశానని, ఫలితం లేకపోయిందని, ఇకపై న్యాయపోరాటమే చేస్తానని  రఘునందన్‌ రావు అన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన టీన్యూస్‌ ఛానెల్‌, టీఆర్‌ఎస్‌లకు లీగల్‌ నోటీసు ఇస్తానని ఆయన తెలిపారు. శుక్రవారం సాయంత్రం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి టిఆర్‌ఎస్‌ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై నిప్పులు చెరిగారు. హరీశ్‌రావు బ్లాక్‌మెయిల్‌పై సీబీఐకి ఆధారాలు ఇస్తానని పేర్కొన్నారు. హరీశ్‌రావుకు సంబంధించిన బ్లాక్‌మెయిల్‌ ఆధారాలను హైకోర్టుకు, సీబీఐకి సమర్పిస్తానని తెలిపారు. పద్మాలయా స్టూడియో నిర్మాణంపై హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్‌ వేసి లక్షలు దండుకున్నారని చెప్పారు. సినీ ప్రముఖులతో విజయశాంతి నివాసంలో రాజీ కుదుర్చుకుని రూ. 80 లక్షలు హరీశ్‌ తీసుకున్నారని తెలిపారు. దీనికి సంబంధించి తనవద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. డబ్బులు అందగానే ఇప్పడుఉ హరీష్‌ పద్మాలయ విషయంలో మాట్లాడడం లేదన్నారు. హరీశ్‌రావు పిటిషన్‌ విషయమై విజయశాంతి నివాసంలో రాజీ కుదిరిందన్నారు. పద్మాలయ స్టూడియోలో నిర్మాణాలపై పిటిషన్‌ ద్వారా హరీశ్‌రావు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారని, ఈ విషయంలో సినీ రంగానికి చెందిన ప్రముఖులు రాజీ కుదిర్చారని రఘునందన్‌రావు చెప్పారు. హరీశ్‌రావు బ్లాక్‌మెయిల్‌పై తన దగ్గర ఉన్న ఆధారాలను సీబీఐ, పోలీసులకు అందిస్తానని రఘునందన్‌రావు విూడియాకు తెలిపారు. సూట్‌కేసులు తీసుకుని హరీశ్‌రావు రాజీపడ్డారని, అందుకే ఇప్పుడు నోరు మెదపట్లేదని రఘునందన్‌రావు అన్నారు. తాను మాట్లాడుతున్న ప్రతి అంశానికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, తెరాస నాయకత్వంపై తన దగ్గర ఉన్న ఆధారాలతో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తానన్నారు. తనపై దాడులు చేయించి బెదిరించాలని చూసినా బెదరనని రఘునందన్‌రావు చెప్పారు. తనని బహిష్కరించడానికి స్పష్టమైన కారణం చెప్పలేకపోతున్నారని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్‌ నేతలు టికెట్లు అమ్ముకుంటున్నారని, జగన్‌ సంపాదించినట్లు టిఆర్‌ఎస్‌ నేతలు సంపాదిస్తే తప్పేంటని ఒక నేత వ్యాఖ్యానించారని ఆయన ఆరోపించారు.