‘రత్నగిరి’లో గుమ్మటాల వేలం రద్దు వ్యవహారంపై కమీషనర్ ఆరా
అన్నవరం,జూలై 24,: ప్రముఖ పుణ్య క్షేత్రమైన అన్నవరం శ్రీవీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానానికి గత ఏడాదిన్నర కాలంలో వచ్చే ఆదాయానికి గండి కొట్టిన వ్యవహారంపై దేవాదాయ కమీషనర్ ధర్యాప్తు ప్రారంభమైంది. భక్తుల సౌకర్యం పేరుతో దేవస్థానం కొండపై ప్రతి యేటా నిర్వహించే వివాహ మండపాల వేలం పాటలను రద్దు చేసిన వ్యవహారం బదిలీపై వెళ్లిన ఇఓ కె రామచంద్రమోహన్ మెడకు చుట్టుకున్నట్టు తెలుస్తోంది. ఏడాదిన్నర క్రితం 60లక్షల ఆదాయం మండపాల వేలంపాట ద్వారా సమకూరేది. పాటదారులు అధిక రేట్లకు మండపాలు ఏర్పాటు చేస్తున్నారనే కారణాన్ని చూపిస్తూ ఇఓ కె రామచంద్రమోహన్ మండపాల ఏర్పాటు వేలంపాటను రద్దు చేసి భక్తులు నేరుగా వారి యిష్టానుసారం ఏర్పాటు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేయడంతో ప్రైవేట్ వ్యాపారుల పంట పండినట్టయ్యింది. దీంతో దేవస్థానానికి ఎటువంటి వివాహ గుమ్మటాలకు కనీస రుసుము చెల్లించకుండా ప్రైవేట్ పాటదారులు భక్తుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసుకుంటూ ఇష్టానుసారంగా అధిక ధరలకు మండపాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ అధికారుల్లో చలనం కనిపించలేదు. ఈ విషయాన్ని న్యూస్విజన్ గతంలో పలు వార్తా కధనాలు ప్రచురించడం జరిగింది. ఏడాదిన్నర కాలం తరువాత తిరిగి మండపాల ఏర్పాటుకు వేలం పాటలకు దేవస్థానం సిద్దం పడింది. శుక్రవారం దేవస్థానం కొండపై జరిగిన ఈ వివాహ మండపాల వేలంపాటల్లో ఏడాదికి 2కోట్ల 34 లక్షల రూపాయలు చెల్లించేందుకు పాట ఖరారయ్యింది. దీనిని బట్టి చూస్తే గత ఏడాదిన్నర కాలంలో దేవస్థానానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని స్పష్టమవుతుంది. గతంలో వేలంపాటను రద్దు చేయడం వెనుక దేవస్థానం సెక్షన్ సంబంధిత సిబ్బంది ప్రైవేట్ వ్యాపారులతో కలిపి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం దేవాదాయశాఖ కమీషనర్ దృష్టికి కొంత మంది వ్యక్తులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో కమీషనర్ దేవస్థానానికి వాటిల్లిన నష్టం గురించి, వేలం పాటల తీరుతెన్నుల గురించి పూర్తి స్థాయిలో వివరాలు కోరినట్టు ఆలయ వర్గాలు బహిరంగంగా చర్చించుకుంటున్నాయి. నాటి ఇఓ కె రామచంద్రమోహన్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం ద్వారా వచ్చిన నష్టాన్ని ఆయనే భరించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించేందుకు కొంత మంది సిద్దపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ ఒక్క వ్యవహారంలోనే దేవస్థానానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లడంతో ఇంకా గత మూడేళ్ల కాలంలో ఇక్కడ జరిగిన అక్రమ వ్యవహారాలు నిబంధనలకు విరుద్దంగా జరిగిన లావాదేవీలపై కూడా కమీషనర్‌కు ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది.