రమ్య హత్యపై తక్షణమే స్పందించిన ఎపి ప్రభుత్వం


వెంటనే నిందితుడిని అరెస్ట్‌ చేసిన తీరు ప్రశంసనీయం
బాధి కుటుంబానికి ఆర్థిక సాయం కూడా అందించింది
జాతీయ ఎస్సీ కమిషన్‌ వెల్లడి
గుంటూరు,అగస్టు23(జనంసాక్షి): రమ్య హత్య జరిగిన వెంటనే ఎపి ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమని జాతీయ ఎస్సీ కమిషన్‌ తెలిపింది. నిందితుడిని పట్టుకోవడమే గాకుండా బాధిత కటుంబానికి పరిహారం కూడా ఇచ్చిందని, ఇది ఇతర రాష్టాల్రకు ఆదర్శమని తెలపింది. ఇటీవల గుంటూరు నగరంలో జరిగిన బీటెక్‌ విద్యార్థిని రమ్య దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం
తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్‌ విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ బృందం మంగళవారం గుంటూరులో పర్యటించింది. ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ అరుణ్‌ హల్డర్‌ మాట్లాడుతూ.. ఈ ఘటన చాలా బాధ కలిగించిందని అన్నారు. అతి తక్కువ సమయంలోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారని ఆయన తెలిపారు. నిందితుడిపై త్వరగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని కోరామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పనితీరును అరుణ్‌ హల్డర్‌ ప్రశంసించారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం కూడా ఏపీ ప్రభుత్వం వెంటనే అందించిందని ఆయన గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వ దృక్పథం చాలా పాజిటివ్‌గా ఉందని ఆయన వివరించారు. దేశం మొత్తం ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును పరిగణనలోకి తీసుకోవాలని వైస్‌ ఛైర్మన్‌ అన్నారు. గుంటూరు రూరల్‌, అర్బన్‌ పోలీస్‌ అధికారులు బాగా పని చేశారు. వారందరికీ అవార్డులు ఇవ్వాలని సిఫార్సు చేస్తామని వైస్‌ ఛైర్మన్‌ అరుణ్‌ హల్డర్‌ తెలిపారు.