‘రష్యాతో మా బంధం ప్రత్యేకం’
మాస్కో: రెండు రోజుల రష్యా పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్రమోడీ బుధవారం మాస్కో చేరుకున్నారు. క్రిస్మస్ సంబరాల నేపథ్యంలో ఇక్కడికి చేరుకున్న ప్రధానికి రష్యా ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. చిరుజల్లుల వాతావరణంలో ప్రధానికి వ్నుకోవా-2 విమానాశ్రయంలో గౌరవ వందనం సమర్పించారు.
మాస్కో విమానాశ్రయంలో గౌరవవందనం సందర్భంగా ప్రధాని మోదీ తడబడ్డారు. రష్యన్ మిలిటరీ బ్యాండు భారత జాతీయ గీతం వాయిస్తుండగా ఆయన ముందుకు కదిలారు. దాంతో వందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రష్యా అధికారి ఆయనను చేతితో నిలువరించిన ఘటన చోటుచేసుకుంది.
‘మాస్కో చేరుకున్నాను. స్వల్పకాలికమే అయినా ముఖ్యమైన ఈ పర్యటనలో పలు కార్యక్రమాలు వేచి చూస్తున్నాయి’ అని ప్రధాని మోడీ ఇంగ్లీషు, రష్యా భాషల్లో ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
రష్యా పర్యటనలో తొలిరోజైన బుధవారం స్వాగత సత్కారాలు, విందు సమావేశాలు జరిగాయి. ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ బుధవారం రాత్రి వ్యక్తిగత విందు ఇచ్చారు. ఈ విందు సందర్భంగా ఉభయ నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై ముఖాముఖి చర్చలు జరిపారు.
రెండోరోజైన గురువారం పుతిన్‌తో వార్షిక శిఖరాగ్రసమావేశం ఉంటుంది. ఈ సందర్భంగా ఆర్థిక, రక్షణ తదితర రంగాలలో సహకారానికి సంబంధించిన అనేక కీలక ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయని భావిస్తున్నారు. రూ.40 వేల కోట్లతో ఎస్-400 గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థల కొనుగోలు ఒప్పందం అందులో ముఖ్యమైంది.
పాశ్చాత్య ఆంక్షలతో ఆర్థికవ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యంలో భారత్‌తో ఆర్థిక సంబంధాల్ని పెంచుకోవడంపై పుతిన్ ఆసక్తిచూపుతున్నారు. విద్యుత్తు అవసరాల్ని ఎదుర్కొంటున్న భారత్ రష్యాలోని ప్రధాన చమురు, వాయువు అన్వేషణ ప్రాజెక్టుల్లో పాలుపంచుకోవాలని భావిస్తోంది.
భారత్‌లో సైనిక రవాణా హెలికాప్టర్ల తయారీకి ఉద్దేశించిన మరో ఒప్పందంపై కూడా మోడీ ఈ పర్యటన సందర్భంగా సంతకాలు జరుగుతాయంటున్నారు. అనంతరం భారత్, రష్యా సీఈవోల బృందంతో ప్రధాని మోడీ, పుతిన్‌లు సమావేశమవుతారు. రష్యా వాణిజ్యవేత్తలతో సమావేశమై, భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించనున్నారు.
మాస్కోలో అజ్ఞాత సైనికుని సమాధిని ప్రధాని మోడీ సందర్శించి నివాళి అర్పిస్తారు. మోడీ కోసం ఏర్పాటు చేసిన పౌరసన్మానంలో భారతీయ సంస్కృతిపై వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి సుప్రసిద్ధ కవిత గీత్ నయా గాతాహూ ఆధారంగా రూపొందించిన నృత్యరూపకం ఈ కార్యక్రమాల ప్రత్యేకతగా నిలుస్తుంది.
Read more about: