రసవత్తరంగా కన్నడ రాజకీయం

– తెరవెనుక చక్రం తిప్పుతున్న నేతలు
– కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు భాజపా గాలం
– తమకు మరో 20మంది మద్దతు ఉందంటున్న భాజపా
– కీలక సమావేశానికి డుమ్మాకొట్టిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
– అందుబాటులో లేని ఐదుగురు ఎమ్మెల్యేలు
– ఆందోళనలో కాంగ్రెస్‌
– జేడీఎస్‌లోనూ చీలిక.. ఆజ్ఞాతంలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు 
– ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వండి
– గవర్నర్‌ను కోరిన యడ్యూరప్ప
– రేపు ప్రమాణ స్వీకారం చేస్తా – యడ్యూరప్ప 
బెంగళూరు, మే16(జ‌నం సాక్షి) :  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్‌ ఏర్పడడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు క్షణక్షణం రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఎమ్మెల్యేలను లాగేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఇప్పటికే బీజేపీ తమకు కాంగ్రెస్‌, జేడీఎస్‌ల నుంచి ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని, తమ ఎమ్మెల్యేలే కాకుండా మరో 20మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతుగా ఉన్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో అన్ని పార్టీలు నిమగ్నమయ్యాయి. అయితే కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు అదృశ్యం కావడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. బుధవారం బెంగళూరులో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన శాసనసభా పక్ష సమావేశానికి కొత్తగా ఎన్నికైన 78 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో 66 మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. దీంతో మిగతా 12 మంది ఎమ్మెల్యేలు ఎందుకు సమావేశానికి హాజరుకాలేదనే అంశంపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. అనంతరం వీరిలో ఏడుగురు ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయినా మరో ఐదుగురు డుమ్మా కొట్టడం కాంగ్రెస్‌ను కలవరపెడుతుంది. భాజపా కొందరు ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్‌.శంక్ర్‌ ఇప్పటికే భాజపాకు తన మద్దతు ప్రకటిస్తూ రాతపూర్వకంగా వెల్లడించారు. దీంతో భాజపా సంఖ్య 105కు చేరింది. కాంగ్రెస్‌
ఎమ్మెల్యేలు రాజశేఖర్‌ పాటిల్‌, నరేంద్ర, ఆనంద్‌ సింగ్‌లు బుధవారం ఉదయం నుంచి కాంగ్రెస్‌ నేతలకు అందుబాటులో లేరని తెలుస్తోంది. అయితే వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు భాజపా తరఫున పోటీ చేసి గెలిచిన గాలి సోదరులకు సన్నిహితులని సమాచారం. దీంతో వీరు భాజపా గూటికి వెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే జేడీఎస్‌ పార్టీకి చెందిన రాజ వెంకటప్ప నాయక, వెంకట రావ్‌ నాదగౌడ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కనిపించకుండా పోయారు. బెంగళూరులోని అయిదు నక్షత్రాల ¬టల్‌లో జరిగిన జేడీఎస్‌ శాసనసభా పక్ష సమావేశానికి ఈ ఇద్దరు నేతలు హాజరుకాకపోవడం గమనార్హం. తమ పార్టీకి చెందిన అయిదుగురు శాసనసభ్యులను ఇప్పటికే భాజపా నేతలు సంప్రదించారని జేడీఎస్‌ వెల్లడించింది. తనను కూడా భాజపా సంప్రదించిందని మరో కాంగ్రెస్‌ నేత కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించే యోచనలో ఉన్నారు. ఇదిలా ఉంటే జేడీఎస్‌లో చీలిక వచ్చిందని, దేవగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణకు 10మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వారి మద్దతు మాకే అని బీజేపీ చెప్పుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం కుమారస్వామి, రేవణ్ణలు ఇద్దరు కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తమలో ఎలాంటి చీలక లేదని, బీజేపీ జేడీఎస్‌లో చీలిక తేవాలని చూస్తుందని అది సాధ్యం కాదని హెచ్చరించారు. బీజేపీ ఇప్పటికైన తమ కుట్రలు మానుకోకపోతే బీజేపీ నుంచి తాము ఎమ్మెల్యేలను లాగేందుకు యత్నిస్తామని, తమవైపు వచ్చేందుకు 40మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారని కుమారస్వామి అన్నారు.
రేపు ప్రమాణ స్వీకారం చేస్తా – యడ్యూరప్ప
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రమాణం స్వీకారం చేయబోతున్నట్లు బీజేపీ శాసనసభా పక్ష నేత బీఎస్‌ యడ్యూరప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలు హాజరుకాబోతున్నట్లు వెల్లడించారు. ప్రమాణస్వీకారం కోసం బీజేపీ ఇప్పటికే ఏర్పాట్లనుసైతం పూర్తిచేసినట్లు తెలిసింది. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం యడ్యూరప్ప ఎమ్మెల్యేలతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు లేఖను సమర్పించారు. మరో వైపు ఒక స్వతంత్ర అభ్యర్థి బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ బలం అధికారికంగా 105కు చేరుకుంది.
మరోవైపు మిగిలిన ఎమ్మెల్యేల మద్దతు కోసం బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. ఈలోగా యడ్యూరప్ప తరచూ సంచలన ప్రకటనలు చేస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌లలో గుబులు
పుట్టిస్తున్నారు.
యెడ్డీ ధీమా వెనక ఆ 10మంది ఎమ్మెల్యేలు!
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ పకడ్బందీ ప్రణాళికతోనే వెళుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మ్యాజిక్‌ ఫిగర్‌కు 8సీట్ల దూరంలో నిలిచిపోయినా.. మెజార్టీ సంపాదించొచ్చన్న ధీమాతోనే యడ్యూరప్ప అండ్‌ టీమ్‌ ఉందని చెబుతున్నాయి. అందుకే ప్రమాణస్వీకారానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అసలు విషయానికొస్తే.. కాంగ్రెస్‌, జేడీఎస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలతో మాటామంతీ ముగించుకున్న బీజేపీ.. 10 మంది ఎమ్మెల్యేలను అందుబాటులో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. బలనిరూపణ సమయంలో వీరు బీజేపీకి అనుకూలంగా ఓటెయ్యనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీజేఎల్పీ విూటింగ్‌ చకచకా ముగించుకుని.. శాసనసభాపక్ష నేతగా యడ్యూరప్పను ఎన్నుకున్నట్టు తెలిసింది. అనంతరం గవర్నర్‌ వాజుభాయ్‌ వాలాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేసింది. గరవ్నర్‌ను కలిసిన వారిలో బీజేపీ నేతలతో పాటు ఓ స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ఉండటం గమనర్హం.