రసాయన పరిశ్రమలపై విచారణ
శ్రీకాకుళం, జూలై 12 (: జిల్లాలోని రసాయన పరిశ్రమలు పర్యావరణాన్ని గ్రీన్‌బెల్టు విధానానికి తూట్లు పొడుస్తున్నాయి. దీనిపై స్థానికుల నుంచి వ్యతిరేకతతో పాటు పలు పత్రికల్లో కథనాలు వస్తుండడంతో జిల్లాకు నూతనంగావచ్చిన కలెక్టర్ సౌరబ్‌గౌర్ స్పందించారు. జిల్లాలో ఉన్న పరిశ్రమలు పర్యావరణానికి సంబంధించి గ్రీన్బెట్లును ఎలా అమలు చేస్తున్నాయో తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ గోపాలకృష్ణకు విచారణ కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించారు. డిఎఫ్ఓ, కాలుష్యనియంత్రణ మండలి ఇఇ సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ ఇప్పటికే ఎచ్చెర్ల మండలంలోని నాగార్జున అగ్రికెం, వరం పవర్ ప్రాజెక్టు, రణస్థలం మండలం డాక్టర్ రెడ్డిల్యాబ్స్, అరబిందో, ఆంధ్ర ఆర్గానిక్ తదితర పరిశ్రమల్లో గ్రీన్బుల్టుకు ఎంత విస్తీర్ణం కేటాయించారో, మొక్కలు, చెట్లు ఎలా ఉన్నాయో పరిశీలించింది. ఇంకా మరికొన్ని పరిశ్రమలను పరిశీలించనుంది. ఇందుకు సంబంధించిన తుది నివేదికను కలెక్టర్ సౌరబ్గౌర్కు ఈ కమిటీ ఇవ్వనుంది.