రాంరెడ్డి వెంకటరెడ్డి కన్నుమూత
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి (72) శుక్రవారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అప్పటినుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లుగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధికి సికింద్రాబాద్ కిమ్స్‌లో వైద్యం చేయించుకుంటున్నారు.
ఈరోజు ఉదయం రాంరెడ్డి వెంకటరెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో గుండెపోటుతో మృతి చెందారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్కుమార్ రెడ్డిల హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రాంరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ పీఏసీ చైర్మన్గా ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. రాంరెడ్డి వెంకటరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దామోదర్ రెడ్డి స్వయాన ఆయనకు సోదరుడు.