రాజకీయలబ్దికి మేడిగడ్డను వాడుకుంటున్నారు
` బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చినా తెలంగాణపై అదే వివక్షా?: కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి): మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది, దీనిని కేవలం రాజకీయ విమర్శలకే వాడుకుంటోందని, ఇప్పటికైనా తెలంగాణ ప్రజల బాగోగులను దృష్టిలో ఉంచుకుని రాజకీయాలు వీడి వెంటనే మరమ్మతులు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.తెలంగాణపై ప్రధాని మోదీ మొదటి నుంచే మనసులో ద్వేషం నింపుకున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘సాబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అంటూనే అందులో తెలంగాణను మాత్రం దూరం పెడుతున్నారన్నారని విమర్శించారు. తెలంగాణకు నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు అడిగినప్పటికీ ఆయన పట్టించుకోలేదని చెప్పారు. ఇతర రాష్ట్రాలపై మాత్రం ఎనలేని ప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు. మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు చేసిన అన్యాయం అంత ఇంత కాదని విమర్శించారు.హైదరాబాద్ మెట్రో కోసం నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. తాజాగా ప్రకటించిన బడ్జెట్‌లోనూ మళ్లీ హైదరాబాద్ మెట్రోకు మొండి చెయ్యే చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ మోదీ తన తెలంగాణ వ్యతిరేకత ఎన్నోసార్లు బయటపెట్టుకున్నారని చెప్పారు. అదే ద్వేషాన్ని మన రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇచ్చే విషయంలోనూ చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో గెలిచే పార్టీ ఎంపీలు ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుందని భావించిన తెలంగాణ ప్రజలు ఈ సారి బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఏం ప్రయోజనం అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కన్నా కూడా మనకు నిధుల్లో కోతలు పెట్టారన్నారు. మరి తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీకి 8 సీట్లు ఇచ్చింది రాష్ట్రంపై ఇలా వివక్షను మరింత చూపేందుకేనా అని ప్రశ్నించారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ మెట్రోకు ఎన్నోసార్లు నిధులు కావాలని అడిగితే పట్టించుకోలేదని గుర్తుచేశారు.ఇదే కేంద్రం హైదరాబాద్ మెట్రోను విస్మరిస్తూ మిగతా రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టులకు మాత్రం భారీగా నిధులు కేటాయిస్తుందని లెక్కలతో సహా కేటీఆర్ వివరించారు.