రాజకీయాలు అభివృద్దికి ఆటంకంకారాదు: వెంకయ్య

న్యూఢిల్లీ,ఫిబ్రవరి25 (జ‌నంసాక్షి) : రాజకీయాలు అభివృద్ధికి ఆటంకం కారాదని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఏదైనా చర్చించి నిర్ణయం తసీఉకుందామన్నదే తమ అభిమతమన్నారు.  లోక్‌సభలో ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లు విషయంలో విపక్షాల తీవ్రనిరసనలపై ఆయన స్పందిస్తూ… ప్రభుత్వంపై పదేపదే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మోదీ పాలనపై ప్రజలకు విశ్వాసముంది. అభివృద్ధే మా ఏకైక నినాదం. మత విశ్వాసాలపై పలుమార్లు ప్రధాని స్పష్టంగా చెప్పారు. సభ వెలుపల ఎవరో ఏదో అంటే ఇక్కడ చర్చించడం ఎలా?. ప్రపంచమంతా దేశం, ప్రధాని మోదీ వైపు సూస్తోందని ఆయన పేర్కొన్నారు.ప్రధానమంత్రిపై ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలు అర్ధరహితమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. బుధవారం పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాక ఆయన లోక్‌సభలో ప్రసంగించారు. సబకా సాత్‌.. సబ్‌కా వికాస్‌.. తమ విధానమని  వెంకయ్య నొక్కిచెప్పారు. మోదీ పాలనపై ప్రజలకు విశ్వాసముందని, అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. దేశంలో ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరాలపై దాడి జరిగినా ఖండించాలన్నారు. సంపదను అందరికీ పంచాలంటే.. అందుకు తగ్గట్టే సంపద వృద్ధి చేసుకోవాలని, అలా కాకుండా పంచుకుంటూ పోతే చివరికి పంచే మిగులుతుందని వెంకయ్య వ్యాఖ్యానించారు. స్వచ్ఛభారత్‌ను నిజం చేసి చూపిస్తామని అన్నారు. రాజకీయాలు అభివృద్ధికి ఆటంకం కలిగించకూడదన్నారు.