రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడరు
మునుగోడు ఉప ఎన్నిక రాదు
కాంగ్రెస్‌లో ఉంటూనే టిఆర్‌ఎస్‌పై పోరాడుతారు
ఎఐసిసి కార్యదర్శి వంశీచంద్ రెడ్డి విశ్వాసం
హైదరాబాద్,జూలై30(జనంసాక్షి): శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం దాదాపు ఖాయమైన పరిస్థితుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. చర్చించేందుకు దిల్లీకి రావాలని ఆపార్టీ అధిష్ఠానం ఆహ్వానించినా ఆయన వెళ్లకపోవడంతో కాంగ్రెస్ పెద్దలు బుజ్జగింపులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. రాజగోపాల్ రెడ్డితో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడరని వంశీచంద్‌రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదని.. పార్టీని వీడడని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి స్పష్టం చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయరని.. ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రాజగోపాల్‌రెడ్డి నివాసంలో భేటీ అనంతరం ఆయన ఈ మేరకు వెల్లడిరచారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డిని తాను రోజూ కలుస్తానని వంశీచంద్‌రెడ్డి తెలిపారు. తెరాసతో కొట్లాడేది కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉండి తెరాసతో కోట్లాడతాడన్నారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పుపై ఇటీవల బండి సంజయ్ మాటలు ఉత్తవేనని కొట్టిపారేశారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడడు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడు. ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదని వంశీచంద్ నమ్మకంగా చెప్పారు.
రాజగోపాల్ రెడ్డి ఇంటి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తల నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డిని బుజ్జగించినట్లు తెలుస్తోంది.తెరాస పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించే దిశగా వేస్తున్న అడుగుల్లో రాజీ పడేది లేదని శుక్రవారం రాజగోపాల్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. రాజీనామా, మనుగోడు ఉపఎన్నిక ఖాయమనే అంశాలను తేల్చి చెప్పారు. సొంత ప్రయోజనాలు, పదవులు తన లక్ష్యం కాదని పేర్కొంటూ ఇటీవల వస్తున్న విమర్శపై స్పందిస్తూ.. తన నిర్ణయాన్ని మునుగోడు నియోజకవర్గ ప్రజలతో పాటు అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయంటూ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరే అంశాన్ని పరోక్షంగా పేర్కొన్నారు. మరో కురుక్షేత్ర యుద్దానికి సమర శంఖం పూరించాలంటూ మునుగోడు ఉప ఎన్నిక ఖాయమన్నట్లు సంకేతాలిచ్చారు.