రాజన్న.. చంద్రన్నవి చీకటి రాజ్యాలు
మనకు కావాల్సింది తెలంగాణ రాజ్యం
యుద్దం చేసేవాడి చేతిలో కత్తి పెట్టండి
ప్రమాదమంచున కిరణ్ సర్కార్
హైదరాబాద్,నవంబర్15 (జనంసాక్షి) :
మనకు కావాల్సింది తెలంగాణ రాజ్యం తప్ప రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం కాదని టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. గత 20 ఏళ్ళుగా ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా దోచుకున్నాయని, దోచుకున్న పార్టీల రాజ్యం మనకెందుకని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిగిలో ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో కెసిఆర్ ఆవేశపూరితంగా ప్రసంగించారు. తెలంగాణకు వైఎస్సార్, చంద్రబాబు ద్రోహులని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ను దోచుకున్నదే వారిద్దరని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలోని విలువైన భూములను తెగనమ్ముకున్న ఘనులు వీరని ఆయన
ఆరోపించారు. విలువైన భూములను రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు, బంధువులకు కట్టబెట్టుకున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో కరెంట్ బిల్లులు కట్టకపోతే పిట్టలను కాల్చినట్టు కాల్పించాడని ఆరోపించారు. 2004లో టిఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్న వైఎస్సార్ నక్కజిత్తుల నయవంచనతో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. కడుపులో కత్తులు పెట్టుకొని నోట్లో బెల్లాలు పెట్టుకొని మాట్లాడే రకాలు వేరని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు మాత్రమే ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి మార్గమని అన్నారు. రాజకీయ పార్టీల వలలో చిక్కకుండా తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు కదలాలని అన్నారు. కత్తి తన చేతిలో పెడితే పోరాటం చేస్తానని అన్నారు. అంతే తప్ప కత్తి ఒకరి చేతిలో పెట్టి కెసిఆర్‌ను పోరాడడం అంటే సాధ్యం కాదన్నారు. 1969 నుంచి తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎన్నో రకాలుగా మోసాలు చేస్తోందని విమర్శించారు. గత 12 ఏళ్ళుగా తాను తెలంగాణ కోసం పోరాడుతున్నామని, కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ఇబ్బందులు పెడుతోందని అన్నారు. పాదయాత్రల పేరుతో చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టడానికి వస్తున్నాయని, వారి మాయలో పడొద్దని హెచ్చరించారు. తొమ్మిదేళ్ళ టిడిపి, తొమ్మిదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురయిందని ఆయన అన్నారు. తిరిగి దొంగే దొంగ అన్నట్లుగా తామేదో బాగు చేస్తామని బాకాలు ఊదుతూ వస్తున్నారని అన్నారు. ఈ సమస్యలన్నింటికి వీరు కారణం కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో భూములకు నీళ్ళు రావు, కరెంట్ ఉండదు వీటన్నింటికి బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం తనకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ వస్తే ఈ ప్రాంత ప్రజలకు కష్టాలు దూరమై చక్కటి పాలన అందుతుందని అన్నారు. విద్యార్ధులకు కెజి నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామన్నారు. కృష్ణానది నుంచి రంగారెడ్డి జిల్లాకు లిఫ్ట్ ద్వారా నీటిని అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా కృష్ణా బేసిన్‌లోనే ఉందని ఆయన గుర్తు చేశారు. అమలుకు వీలుకాని ప్రాణహిత-చేవెళ్ల పేరుతో ఓ రాయి పడేసి మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తే ఈ పనులన్ని చేసుకోవడానికి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. 1956లో కేంద్రం బలవంతంగా తెలంగాణను ఆంధ్రాలో కలిపిందని అప్పటినుంచి తెలంగాణకు కష్టాలు తప్పడం లేదన్నారు. నీళ్ళ, నిధులు, ఉద్యోగాలు పోయి పూర్తిగా నష్టపోయామన్నారు. మా తెలంగాణ మాకు కావాలంటున్నామే తప్ప గొంతెమ్మ కోరికలు కోరటం లేదన్నారు. అయితే కాంగ్రెస్ కాలుకుపెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు అన్నట్టుగా తెలంగాణ విషయంలో మోసం చేస్తుందని కెసిఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ ఇస్తానంటే టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలపడానికి కూడా సిద్దమయ్యారని అన్నారు. ఢిల్లీకి చర్చలతో పేరుతో పిలిచి మోసం చేశారని అన్నారు. అందుకే ఇక మరోమారు బడిత పట్టుకొని బయల్దేరానని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పడితే రూపాయికి కిలో బియ్యం లాంటి అక్కర్లేదని, మనమే రూపాయికి కిలో బియ్యం ఇస్తామని అన్నారు. ఛత్తీస్‌గడ్‌తో ఒప్పందం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 12 గంటల కరెంట్ ఇచ్చుకుంటామన్నారు.
కిరణ్‌కుమార్ సర్కార్ ప్రమాదం అంచున ఉందని, తుమ్మితే ఊడే ముక్కుల ఆయన పరిస్థితి ఉందని కెసిఆర్ అన్నారు. ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలని డిమాండ్ చేసి తెలంగాణ తెచ్చుకునేందుకు ఈ ప్రాంత నాయకులు సిద్దంగా ఉండాలని అన్నారు. జాగ్రత్తగా ఉండకపోతే మరోమారు మోసపోకతప్పదని హెచ్చరించారు. అంతకుముందు ఆయన హరీశ్వర్‌రెడ్డి తదితరులకు కండువా కప్పి టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. టిడిపి తెలంగాణకు బద్దవ్యతిరేకి కావడం వల్లనే తాను తెలంగాణ కోసం టిఆర్‌ఎస్‌లో చేరుతున్నానని హరీశ్వర్‌రెడ్డి చెప్పారు. ఎలాంటి రాజకీయ ఆపేక్ష లేకుండా తాను తెలంగాణ కోసం టిడిపిని వదులుకుంటున్నానని అన్నారు. తెలంగాణ గురించి మాట్లాడినందుకే తనకు మంత్రి పదవికూడా చంద్రబాబు ఇవ్వలేదని అన్నారు. టిడిపి హయాంలో తెలంగాణకు అన్యాయమే తప్ప న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు కేవలం కెసిఆర్ వల్ల మాత్రమే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు ఈటెల రాజేందర్, టిఎన్జీవో మాజీ నాయకులు స్వామిగౌడ్, మాజీ డీజీపీ పేర్వారం రాములు తదితరులు పాల్గొన్నారు. పరిగి సభకు వేలాది ప్రజలు హాజరు కావడంతో పట్టణమంతా గులాబీమయంగా మారింది.