రాజన్ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు

రెండోదఫా గవర్నర్ గా కొనసాగకూడదన్న రాజన్ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. దేశానికి విచారకరమని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక మేథావుల్లో ఒకరిని భారత కోల్పోతోందన్నారు. ఆయన నిర్ణయం దేశానికేకాక ప్రభుత్వానికి కూడా విచారించే అంశమన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు రాజన్ పై నిప్పులు చిమ్ముతున్నట్లు తెలిసిందని, ఇది దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం తన సొంత విధానాలు అమలు చేయాలని భావించి రాజన్ కు ప్రత్యామ్నాయాలు చూసుకొని ఉండొచ్చని అన్నారు.

రాజన్ నిర్ణయం దేశానికే తీరని నష్టమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఆయన భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని పెంచగలగడంతోపాటు ప్రపంచ వేదికపై దేశ సామర్థ్యంపై విశ్వసనీయతను పెంచారని వారు అన్నారు. రాజన్ తర్వాత గవర్నర్గా బాధ్యతలు చేపట్టే వ్యక్తి ఆయన చేసిన మంచి పనులను కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా, దీపక్ పరేఖ్, ఎన్ఆర్ నారాయణమూర్తి, కిరణ్ మజుందార్ షా, మోహన్ దాస్ పాయ్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు తెలిపారు. వాణిజ్య మండలి అసోచామ్ మాత్రం.. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మంచిదికాదని అన్నది. అటు డాక్టర్ రాజన్ అత్యున్నత నిపుణులని.. ఆర్బీఐపై విశ్వసనీయతను పెంచగలిగారని ఎస్ బీఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు.

అటు గవర్నర్ పదవిలో కొనసాగే విషయంలో రాజన్ తీసుకున్న నిర్ణయం నిరాశపర్చడంతో పాటు తీవ్రంగా బాధపెట్టిందని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం అన్నారు. అయితే ఈ పరిణామం తనకు ఏమాత్రం ఆశ్చర్యం కల్గించలేదన్నారు. రాజన్ లాంటి సమర్థవంతమైన వ్యక్తి ఈ ప్రభుత్వానికి తగడని తాను ఇంతకుముందే చెప్పినట్లు గుర్తు చేశారు. కాకపోతే దేశం నష్టపోవాల్సి వస్తుందని చిదంబరం అన్నారు.

అటు రెండోసారి పదవిలో కొనసాగనని రాజన్ నిర్ణయించుకోవడం మంచిదేనని, అసలు రెండోసారి తనకు అవకాశం ఇవ్వరని ఆయనకు ముందే తెలుసని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యానించారు. రాజన్ కూడా ప్రభుత్వోద్యోగి అని, ఏ ఉద్యోగినైనా పాపులారిటీ ఆధారంగా ఎంపిక చేయడం ఉండదని ఆయన అన్నారు. రాజన్ను రెండోసారి కొనసాగించవద్దని సుబ్రమణ్యస్వామి ఇటీవల ప్రధానికి లేఖ రాసి కలకలం సృష్టించారు. రాజన్ మానసికంగా పూర్తి భారతీయుడు కాదని ఆయన విమర్శలు గుప్పించారు. తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు.

అటు రాజన్ దేశ ఎకానమీకి చేసిన సేవలు విలువైనవి అని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అన్నారు. అయితే రెండోసారి కొనసాగకూడదన్న ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. రాజన్ వారసుడిని త్వరలో ప్రకటిస్తామని జైట్లీ వెల్లడించారు.