రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి 

తృణముల్‌ నేత!
– ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం
– మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకారం?
న్యూఢిల్లీ, జూన్‌27(జ‌నం సాక్షి) : రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత బరిలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అటు అధికార భాజపా కూడా తమ అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తుండటంతో డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి ఈసారి ఎన్నిక అనివార్యం కానుంది. ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెందిన పీజే కురియన్‌ ఉన్నారు. వచ్చే నెలలో ఆయన పదవీకాలం పూర్తికానుంది. అయితే ఈ పదవి కోసం భాజపా, కాంగ్రెస్‌ మధ్య పోటీ నెలకొంది. రాజ్యసభలో అధికార ఎన్డీయే కూటమి కంటే ప్రతిపక్షాల సంఖ్యా బలం ఎక్కువ. దీంతో ప్రతిపక్షాలన్నీ కలిపి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్నాయి. ఇందుకు భాజపా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి తమ పార్టీ నుంచి అభ్యర్థిని బరిలోకి దించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక అనివార్యం కానుంది. మరోవైపు ప్రతిపక్షాల కూటమికి తొలుత కాంగ్రెస్‌ సారథ్యం వహించాలని భావించింది. అయితే ఈ ఎన్నికల్లో భాజపాపై విజయం సాధించాలంటే బిజు జనతాదళ్‌, తెరాస మద్దతు అవసరం. ఈ రెండు పార్టీలు తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థికే మొగ్గుచూపుతున్నాయి. దీంతో ప్రతిపక్షాల కూటమికి తృణమూల్‌ కాంగ్రెస్‌ సారథ్యం వహించేందుకు కాంగ్రెస్‌ అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తృణమూల్‌ నేత సుఖేందు శేఖర్‌ రాయ్‌ను డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక బరిలోకి దించాలని విపక్షాలు భావిస్తున్నాయి. చివరిసారిగా 1992లో డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున నజ్మా హెప్తుల్లా, ప్రతిపక్షాల అభ్యర్థిగా రేణుకా చౌదరి బరిలోకి దిగారు. అందులో నజ్మా 128 ఓట్లతో విజయం సాధించారు. ప్రస్తుతం నజ్మా భాజపాలో చేరారు. మళ్లీ ఈ సారి ఎన్నిక జరిగే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. కాగా.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక అటు ప్రతిపక్షాల కూటమికి. ఇటు భాజపాకు మరో సవాలుగా నిలిచింది.