రామాయణ కాలంలోనే టెక్నాలజీ వినియోగం

రామసేతు నిర్మాణం అందులో భాగమే: పంజాబ్‌ గవర్నర్‌
చండీగడ్‌,మే12(జ‌నం సాక్షి): రామాయణ, మహాభారత కాలంలోనే టెక్నాలజీని బాగా వినియోగించారని పంజాబ్‌ గవర్నర్‌ వి.పి.సింగ్‌ బద్నోర్‌ అన్నారు. సూక్ష్మంగా పరిశీలిస్తే అనేక విషయాలు మనకు బోధపడతాయని అన్నారు.  శ్రీలంకకు వెళ్లేందుకు రాముడు రామ సేతును నిర్మించాడని, రామాయణ కాలంలోనే సాంకేతికత అభివృద్ధి ఉందని బద్నోర్‌ అన్నారు. జాతీయ టెక్నాలజీ దినోత్సవ సందర్భంగా మొహలీలోని నేషనల్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌లో ఆయన  తన  అభిప్రాయం వెల్లడించారు. గవర్నర్‌ మాట్లాడుతూ రామసేతు నిర్మాణం గురించే కాకుండా, హనుమంతుడు లక్షణుడి కోసం సంజీవిని తెచ్చాడని, అప్పట్లోనే అనేక ఆయుధాలను ఉపయోగించారని పేర్కొన్నారు. భారత్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని రామాయణ, మహాభారత కాలాల నుంచీ వినియోగిస్తోందనేందుకు ఈ ఉదాహరణలను గవర్నర్‌ పేర్కొనడం, సమావేశంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులను విస్మయానికి గురి చేశాయి. ఇంటర్‌నెట్‌, శాటిలైట్‌ సమాచార వ్యవస్థ మహాభారత కాలం నుంచీ ఉన్నాయని ఇటీవల త్రిపుర బిజెపి ముఖ్యమంత్రి దేవ్‌ పేర్కొన్నట్లుగానే, ఇప్పుడు ఒక రాష్ట్ర గవర్నర్‌ సైతం మాట్లాడం గమనార్హం.