రాష్ట్రంలో అనిశ్చితికి కాంగ్రెస్సే కారణం
తెలంగాణపై తేల్చండి : నారాయణ
హైదరాబాద్,అక్టోబర్29: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని సమస్యలకన్నా మంత్రివర్గ విస్తరణకే ప్రాధాన్యం ఇవ్వడం దారుణమని సిపిఐ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టిందని ఆయన అన్నారు. రాష్టాన్రికి సింహభాగం కేటాయించే పేరుతో రాష్ట్రంలోని సమస్యలను కాంగ్రెస్ పక్కదారి పట్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు ప్రత్యేక రాష్ట్ర సమస్య రోజురోజుకీ జటిలమవుతున్నా దాన్ని పట్టించుకోకుండా మంత్రివర్గ విస్తరణ చేపట్టడం ద్వారా రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి కేంద్రం తీసుకుంటున్న శ్రద్ధ అర్ధమవుతోందని పేర్కొన్నారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయకుండా ప్రజా సమస్యలపై పోరాడి వుంటే చిరంజీవికి మరింత మంచిపేరు వచ్చేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్నా పరిష్కారం వైపుగా ఆలోచించడం లేదని అన్నారు. మరోవైపు గిట్టుబాటు ధరల కోసం రైతులు ఆందోళన చెందాల్సి వస్తుందని అన్నారు. వివిధ సమస్యలు చుట్టుముడుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మంత్రివర్గ విస్తరణ ఇచ్చిన ప్రాధాన్యత సమస్యల పరిష్కారంలోనూ చూపితే బాగుంటుందని నారాయణ అభిప్రాయపడ్డారు.