రాష్ట్రంలో ఏపీఎండీసీ లేదా?

టీడీపీ నేత బోండా ఉమ విమర్శ

అమరావతి,నవంబర్‌18(జ‌నంసాక్షి): ఇసుక మాఫియా కోసమే శాండ్‌ కార్పొరేషన్‌ డబ్బును వైసీపీ ఏమైనా చేస్తుందని టీడీపీ పొలిట్‌ బ్యూరో మెంబర్‌ బోండా ఉమ విమర్శలు గుప్పించారు. కేంద్ర రంగ సంస్థలు ముందుకూ రావని తెలిసి కూడా వైసీపీ డ్రామాలు అడుతుందని మండిపడ్డారు. రెడ్డి అండ్‌ కంపెనీకి ఇచ్చేందుకే ఈ డ్రామాలు అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏపీఎండీసీ లేదా? అని.. సమర్ధవంతమైన అధికారులు లేరా? అని ప్రశ్నించారు. వైసీపీ చంద్రబాబు ఇచ్చిన ఉచిత ఇసుకను బంగారం ధర చేసిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఇసుకను పక్క రాష్ట్రాలకు అమ్ముకొని రూ.4 వేల కోట్లుపైనే దోచుకున్నారని ఆరోపించారు. లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టలు కొట్టారన్నారు. స్టాక్‌ యార్డ్‌ల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దోచుకున్న ఇసుకపై విజిలెన్స్‌ విచారణ చేయాలని బోండా ఉమా డిమాండ్‌ చేశారు.