రాష్ట్రపతి ఎన్నికను అస్త్రంగా వాడుకోండి..
సకల జనుల సమ్మె తర్వాత రాజకీయ కారణాల దృష్ట్యా స్తబ్దుగా ఉన్న తెలంగాణ పోరాటాన్ని మళ్లీ ఉధృతం చేయాలని జేఏసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమానికి కొత్తరూపునివ్వడానికి పూనుకొంది. ఉద్యమ విస్తరణకు నిర్ణయాలను తీసుకొని, పోరాటాన్ని ఉరికించాలని నిర్ణయించుకొంది. మిలియన్ మార్చ్‌లాగా మరోసారి సెప్టెంబర్ 30న తెలంగాణ మార్చ్ చేపట్టాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఉద్యమిస్తున్నది తెలంగాణ జేఏసీ. దీని మార్గదర్శకాలను గౌరవించి, దాన్ని ఆచరణలో పెట్టవలసిన భాద్యత ప్రతి తెలంగాణవాదిపై ఉంది. ఇప్పటి వరకుత తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న ప్రతి ఉద్యమకారుడు జేఏసీ నిర్ణయాలకు కట్టుబడి, అది రూపొందించిన కార్యాచరణను అమలు చేశాడు. సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె లాంటి భారీ ఉద్యమాలకు రూపకల్పన చేసి, వాటిని విజయవంతంగా నడిపిన చరిత్ర జేఏసీకి ఉంది. ఎప్పుడైనా తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న రాజకీయపార్టీలు తమ పార్టీ, భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా ఉద్యమంలో వెనుకబడి ఉండొచ్చు గాక, కానీ ఏనాడూ జేఏసీ మాత్రం తన కర్తవ్యాన్ని మరువలేదు. ఎందుకంటే, దానికి ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవు. ఇప్పటి వరకు సాగిన తెలంగాణ సాధన పోరాటంలో పలు రాజకీయ పార్టీలు జేఏసీని కూడా తమ ప్రయోజనాల కోసం పావు లాగా వాడుకున్నారు. వాళ్లు ఎన్నిసార్లు ఉద్యమాన్ని చల్లబర్చినా జేఏసీ తన అస్తిత్వాన్ని, సత్తాను చాటుకుంది. ఓ దశలో టీఆర్‌ఎస్ అధినేత కంటే కోదండరాం ప్రజలు, ఉద్యోగ సంఘ నాయకుల్లో అధిక గుర్తింపు పొందారు. సకల జనుల సమ్మె తర్వాత అదే స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కోదండరాం కార్యాచరణ రూపొందించి, ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడ్డ రెండు మూడు రోజులకే టీఆర్‌ఎస్ తన రాజకీయ ఎత్తుగడలను పారించడం మొదలు పెట్టింది. ఆ పార్టీ అధినేత కేంద్రం నుంచి తనకు తెలంగాణ ఏర్పాటుపై సంకేతాలు అందుతున్నాయని ప్రకటించారు. నర్మగ్భంగా ఈ దశలో ఉద్యమం అవసరం లేదని కేసీఆర్ చెప్పకనే చెప్పారు. మొదటి నుంచి కేసీఆర్‌ది ఓ వింత ధోరణి. తెలంగాణ ఉద్యమంపై పేటెంట్ హక్కు తమదే అన్నట్లు మాట్లాడడం ఆయనకు కొత్త కాదు. ఓ పక్క అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణపై ఇంకా కేంద్రం ఏమీ తేల్చలేదని, ఇంకా ఎవరికీ సంకేతాలు పంపలేదని, ఒకవేళ పంపినా అవి ముందుగా తమకే అందుతాయని, వేరే రాజకీయ నాయకులకు అందే అవకాశాలు లేశ మాత్రమైనా లేదని స్పష్టం చేస్తున్నారు. అయినా, కేసీఆర్ తన ప్రకటనల నుంచి వెనక్కి తగ్గడం లేదు. ఇదిలా ఉంటే, ఓ పక్క తెలంగాణ వ్యతిరేకి ప్రణబ్ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. దీంతో ఈ ఎన్నికను తెలంగాణ ఉద్యమానికి అనుకూల ప్రకటన వచ్చేలా వాడుకోవాలని, అవసరమైతే ఎన్నికను బహిష్కరించాలని జేఏసీ అన్ని పార్టీల నాయకులకు లేఖ రాసింది. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న ఏకైక రాజకీయేతర శక్తి జేఏసీ నిర్ణయించిన ఈ కార్యాచరణపై ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా నేటికీ స్పందించడం లేదు టీఆర్‌ఎస్‌తో సహా. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. తెలంగాణపై స్పష్టమైన హామీ ఇవ్వాలని రాష్ట్రపతి ఎన్నికను అస్త్రంగా ప్రయోగించి తెలంగాణ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేయాలి. అవసరమైతే ఎన్నికను బహిష్కరించాలి. ఈ ఎన్నికను బహిష్కరిస్తే తెలంగాణ ఉద్యమానికి వచ్చే నష్టమేమీ లేదు. లాభం తప్ప. తెలంగాణ ప్రజాప్రతినిధులు నిజంగా తెలంగాణ రావాలని కోరుకుంటుంటే జేఏసీ నిర్ణయానికి కట్టుబడి, దానికి అనుగుణంగా రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనాలి లేదా బహిష్కరించాలి. లేకుంటే, ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.