రాష్ట్రపతి ఎన్నికలు బహిష్కరిస్తే తప్పేంటి ?
శ్రీతెలంగాణకు సానుకూలం కానప్పుడు ఈ కోణాన్ని ఆలోచించండి
శ్రీరాజకీయ పార్టీలకు కోదండరామ్ పిలుపు
ఆదిలాబాద్, జూన్ 22 (జనంసాక్షి):
తెలంగాణ అంశాన్ని తేల్చనప్పుడు రాష్ట్రపతి ఎన్నికలను తెలంగాణ ప్రాంత ఎంపీలు,ఎమ్మెల్యేలు బహిష్కరిస్తే తప్పేంటని టీ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కోసం శుక్రవారం ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ నుంచి పార్లమెంట్‌కు శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపిలు, ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.తెలంగాణను తేల్చని కేంద్రానికి ఝలక్ ఇవ్వాలంటే రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమెల్యేలు రూ 25 లక్షలు ఖరీదు చేసి కార్లు తదితర కానుకలకు ఆశపడి సీమాంద్ర నేతలకు అమ్ముడు పోయారని కోదండరాం ఆరోపించారు. తెలంగాణరైతులు విత్తనాలు లేక ఎరువులు లేక నిరసన ప్రదర్శనలు చేపడుతుండగా అధికారంలో ఉన్నవారంతా కుర్చీలను పట్టుకుని వేలాడుతున్నారని ఆయన నిప్పులు చెరిగారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ మహేంద్రనాథ్ యాదవ్ ఆదిలాబాద్ ఎమ్మేల్యే జోగు రామన్న టీఆర్ఎస్ జిల్లా విభాగం అధ్యక్షులు శ్రీహరి రావు తదితరులు పాల్గొన్నారు.