రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ నిర్ణయం ఖచ్చితమైనది
సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ
కందుకూరు, జూలై 18 : రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొనరాదని సిపిఐ జాతీయ సమితి తీసుకున్న నిర్ణయం ఖచ్చితమైనదని సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ అన్నారు. బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన సిపిఐ పట్టణ సమితి సమావేశానికి అరుణ విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎన్‌డిఎ, యుపిఎ అభ్యర్థులు ఆయా కూటముల చేతిలో కీలుబొమ్మలు అని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో గల యుపిఎ కూటమి అనుసరించిన ఆర్ధిక విధానాల రూపకల్పనలో ప్రణబ్ పాత్ర అధికమని అన్నారు. యుపిఎ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాల వలన అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపి జీవనాన్ని అస్తవ్యస్తం చేసిందని అన్నారు. అలాంటి ప్రజా వ్యతిరేక కూటమి అభ్యర్ధికి జనపక్షాన ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఐ ఏ విధంగా మద్దుతు ఇస్తుందో వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్న వారు సమాధానం చెబితే బాగుంటుందని అన్నారు. అదే విధంగా బిజెపి ఆధ్వర్యంలోని ఎన్‌డిఎ అభ్యర్ధి సంగ్మ మతతత్వాన్ని నరనరాన జీర్ణించుకున్న కూటమి అభ్యర్ధి అయినందున లౌకిక వాదాన్ని కోరుకునే సిపిఐ మద్దతు తెలపలేదని అన్నారు. ఇరువురు అభ్యర్థులు ప్రజా వ్యతిరేక కూటములకు చెందిన వారైనందున సిపిఐ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ నిర్ణయంపై వ్యతిరేక ప్రచారాలు నిర్వహించే బూర్జువా పార్టీల ప్రచారాలను పార్టీ శ్రేణులు త్రిప్పికొట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో సారవంతమైన పంట భూములను సెజ్‌ల పేరిట కార్పొరేట్ సంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వం దారాధతం చేసి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి రైతుల కడుపుమీద కొట్టిందని అన్నారు. దూరదృష్టి ముందస్తు జాగ్రత్తలు లేనందున రాష్ట్రం తీవ్ర విద్యుత్ సమస్యతో తల్లడిల్లుతుందని అన్నారు. వేళాపాళా లేని విద్యుత్ కోతల వలన అన్ని వర్గా ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై ప్రజలను చైతన్యపరిచి ఉద్యమబాట పట్టించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని అన్నారు. 23న మునిసిపల్ కార్యాలయం ముట్టడి పట్టణంలోని కొళాయి కనెక్షన్లు, పారిశుద్ధ్య సమస్యలపై ఈ నెల 23న స్థానిక మునిసిపల్ కార్యాలయాన్ని ముట్టడించాలని పట్టణ సమితి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎస్ రావమ్మ, సిపిఐ పట్టణ కార్యదర్శి రాఘవులు పట్టణ సమస్యలపై మాట్లాడారు. సమావేశానికి సిపిఐ కౌన్సిలర్ బాలకోటయ్య, సిపిఐ నాయకులు ఉప్పుటూరి మాధవరావు, ఉరేష్‌బాబు, డి రత్నం, బండి రమణమ్మ, ఎవి రంగారావు, ఎం లక్ష్మీనారాయణ, సులోచనమ్మ, కొండయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.