రాష్ట్ర ప్రభుత్వ నివేదిక అందలేదు – కిషన్‌రెడ్డి

 

హైదరాబాద్‌,నవంబరు 8 (జనంసాక్షి): వరదలను నియంత్రించటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.విపత్తు తక్షణ సాయంగా తెలంగాణకు కేంద్రం రూ.224 కోట్లను పంపిందన్నారు ఎన్నికలపై ఉన్న ద్యాస ప్రభుత్వానికి ప్రజల బాగుపై లేదన్నారు. వరద నష్టంపై సమగ్ర నివేదికలు పంపాలన్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. బీజేపీని బద్నాం చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం నివేదికలు పంపలేదన్నారు. తెలంగాణ రోడ్ల కోసం కేంద్రం రూ. 202 కోట్లు ఇచ్చింది. వరద బాధితులను సీఎం పరామర్శించకపోవటం బాధ్యతారాహిత్యం. హైదరాబాద్‌ అభివృద్ధికి కేటాయించిన రూ.67 కోట్లు ఎటు పోయాయో కేటీఆర్‌ చెప్పాలి. రాబోయే రోజుల్లో తండ్రీ కొడుకుల ప్రభుత్వాన్ని తరిమికొడతామని కిషన్‌ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణపై ప్రధాని మోదీ వివక్ష చూపిస్తున్నారని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదికలు పంపలేదు అని ఆయన అన్నారు. తాడ్‌బండ్‌ సిక్‌ విలేజ్‌ హాకీ గ్రౌండ్స్‌లో ఆదివారం బీజేపీ ఏర్పాటు చేసిన సభకు కిషన్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్‌ బోర్డ్‌ వైస్‌ ఛైర్మన్‌ రామకృష్ణ, బానుక మల్లికార్జున్‌, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.పేదలకు ఎన్ని డబుల్‌ బెడ్రూం ఇచ్చాడో కేటీఆర్‌ చెప్పాలి. పేదలకు ఇవ్వాల్సిన రూ. 10,000లను కూడా కేటీఆర్‌ అనుచరులు తన్నుకుపోతున్నారు. హైదరాబాద్‌కు సముద్రాన్ని తెచ్చిన ఘనత కేసీఆర్‌దే. హైద్రాబాద్‌లో గుంతలు లేని రోడ్లు కేటీఆర్‌ చూపించగలడా?. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌కు లేదు. సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యం కారణంగానే వందల కాలనీలు నీట మునిగాయి. ప్రజలకు అబద్దాలు, అవాస్తవాలు చెప్పటం కేటీఆర్‌కు అలవాటుగా మారింది.

నిధులపై సీఎం కేసీఆర్‌తో చర్చకు సిద్ధం- బండి సంజయ్‌

ముఖ్యమంత్రి పీఠం కోసం కేటీఆర్‌, సంతోష్‌ రావుల మధ్య పంచాయితీ నడుస్తోంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ‘కంటోన్మెంట్‌ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. కంటోన్మెంట్‌కు వచ్చే నిధులన్నీ కేంద్రానివే. కేంద్రం నిధులపై సీఎం కేసీఆర్‌తో చర్చకు సిద్ధం. రాష్ట్ర మంత్రులకు అహంకారం నెత్తికి ఎక్కింది. కేసీఆర్‌ క్యాబినెట్‌లో తాగుబోతులు, తిగురుబోతులున్నారు. దుబ్బాక ఉపఎన్నికపై టీఆర్‌ఎస్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. బీజేపీ ఎక్కడుందో కవిత, బోయినపల్లి వినోద్‌ను అడిగితే తెలుస్తోంది. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది. హిందువుల దేవుళ్ళను అవమాన పర్చిన ఎంఐఎంతో కేసీఆర్‌ పొత్తు పెట్టుకున్నాడు. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్‌ మోసం చేశాడు. కేసీఆర్‌పై మలిదశ ఉద్యమం చేయాల్సిన సమయం వచ్చింది’ అని బండి సంజయ్‌ అన్నారు. (కరోనా పోటు రూ. 52,750 కోట్లు)

బంగారు తెలంగాణ కాదు.. బురద తెలంగాణ- మోత్కుపల్లి

దుబ్బాకలో బీజేపీ విజయం సాధించబోతోందని బీజేపీ నేత మోత్కుపల్లి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం. ప్రజల బాధలు చూడలేని గుడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌. అది ప్రగతి భవన్‌ కాదు.. పాపాల పుట్ట. వరద బాధితులకు ఇస్తున్న నగదు పది వేలు కాదు. రూ. 5వేలు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు.. మరో రూ. 5వేలు వరద బాధితులకు ఇస్తున్నారు. కేసీఆర్‌ పాలనలో బంగారు తెలంగాణ కాదు.. బురద తెలంగాణ అయింది. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బంగారమైంది. హైదరాబాద్‌లో కేసీఆర్‌ కుటుంబం భూములను కబ్జాలు చేస్తోందని మోత్కుపల్లి ఆరోపించారు.