రాష్ట్ర హాకీ మాజీ కోచ్
ఆభరణం మృతి
హైదరాబాద్, జూన్ 2 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ హాకీ కోచ్ ఆర్.డి. ఆభరణం (86) మృతి చెందారు. హిమా యత్‌నగర్‌లోని ఆయన నివాసంలో ఉదయం పది గంటల ప్రాంతంలో చనిపోయారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉంది. రాష్ట్ర పోలీస్ శాఖలో పని చేసిన ఆభరణం ఎన్‌ఐఎస్‌లో డిప్లోమా చేసిన అనంతరం భారత స్పోర్ట్స్ అథారిటీ(సాయ్)కోచ్‌గా నియమితులయ్యారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ(శాప్) హాస్టల్ కోచ్‌గా 1982 నుంచి 92దాకా పని చేశారు. పోలీస్ శాఖలో పని చేయడం క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఆయన తన వద్ద శిక్షణ వచ్చే ఆటగాళ్లకు హాకీ ప్రావీణ్యంతో పాటు క్రమశిక్షణ నేర్పించారు. ట్రిపుల్ ఒలింపియన్ అర్జున అవార్డు గ్రహీత ఎన్.ముకేశ్‌కుమార్, ఒలింపియన్ ఎడ్వర్ట్ అలోయిసిస్, సి.ఆర్.భీమ్‌సింగ్, జూడ్ లాజరస్, టాగూర్‌బాబు లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లను ఆయన తీర్చిదిద్దారు. ఆభరణం వద్ద శిక్షణ పొందిన హాకీ ఆటగాళ్లు నేడు రాష్ట్ర వ్యాప్తంగా పలు డిపార్ట్ మెంట్లలో ఉన్నతస్థాయి పదవుల్లో పని చేస్తున్నారు. ఆభరణం పిల్లలు విదేశాల్లో ఉండడంతో ఆయన అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు నారాయణగూడలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.