రాసిచ్చిన ముక్కలు చదవి మాట్లాడితే ఎలా
ఓటమి భయంతో సినీనటులతో ప్రచారమా?
కూటమితో ప్రాజెక్టుకు గండి తప్పదు
ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్న లక్ష్మన్న
మహబూబ్‌నగర్,నవంబర్17(జనంసాక్షి): నాలుగు రాసిచ్చిన ముక్కుల పట్టుకుని కాంగ్రెస్ నాయకురాలు,నటి ఖుష్బూ మాట్లాడారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా.లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ గురించి ఆమెకు ఏమాత్రం తెలుసన్నారు. ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు నటులను ప్రచారానికి పిలిపించు కుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే సీఎంగా కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని అన్నారు. కెసిఆర్‌తో మాత్రమే బంగారు తెలంగాణ సాధ్యమని లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి కావాలంటే మళ్లీ టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఎక్కడి నుంచో వచ్చిన వారు ఇక్కడ పోటీ చేయడం లేదా ఎక్కడి వారో వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం వల్ల లాభం లేదన్నారు. స్థానికంగా ప్రజల సమస్యలను పట్టించుకునే పార్టీ కేవలం ఒక్క టిఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. కెసిఆర్ అధికారం చేపడితేనే ఇప్పటి వరకు చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం సాగుతందని,లేకుంటే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. రైతులకు సాగునీటి వసతి కల్పించేందుకు, వలసల నివారణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరిత గతిన పూర్తిచేసి జడ్చర్ల నియోజకవర్గంలోని లక్షా 50వేల ఎకరాలకు సాగునీరందించడం జరుగుతుం దన్నారు. ఎత్తిపోతలతో జిల్లా రైతులకు సాగునీరు పుష్కలంగా లభిస్తుందన్నారు. దీంతో వలసలు వెళ్లే అవసరం రాదని, ఇతర రాష్ట్రాల వారు మన దగ్గరకు వలసలు వచ్చే రోజులు వస్తాయన్నారు. రైతులను రాజులను చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.4వేల చొప్పున రెండు విడతలుగా పెట్టుబడి సాయం అందించడం జరుగుతుందన్నారు. పేద ల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమ లు చేయడం జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలో దొడ్డిదారిన అధికారం చేపట్టి, సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు కాంగ్రెస్,టీడీపీలు కుట్రలు పన్నాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, కుట్రదారులను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి ఓటే సరైన మార్గమన్నారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరించిందని, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత హర్షవర్ధన్‌రెడ్డి గ్రీన్ ట్రిబ్యూనల్‌లో కేసులు వేశారని గుర్తు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాలమూరు-రంగారెడ్డి పనులు నిలిపివేయాలని కోరుతూ కేంద్ర జలవనరుల సంఘానాకి లేఖ రాశాడన్నారు. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారని తెలిపారు. అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడు తున్న కాంగ్రెస్, టీడీపీలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ను ఆదరించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం మహాకూటమి ఏర్పడిందని, రాష్ట్రాన్ని నాశనం చేయడమే కూటమి లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వ పాలన ఎలా సాగిందో తెలంగాణ ప్రజలు చూశారని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి చేస్తున్నామో చూస్తున్నారని, కూటమికి ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. జిల్లాలో మహాకూటమికి ఒక్క సీటు కూడా రాదని, రాష్ట్రంలో సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని తెలిపారు.
ఈ అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.