రాస్తారోకోతో ఉధృతమైన వీఆర్ఏల ఉద్యమం

శివ్వంపేట అక్టోబర్ 8 జనంసాక్షి : రాష్ట్ర ప్రభుత్వం  వీఆర్ఏలతో వెట్టి చాకిరి చేయించుకుంటూ గత 76 రోజులుగా చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం దిగి రాకుండా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం లేదని భావించిన జేఏసీ  రాష్ట్ర కమిటీ ఈనెల 8న ఎక్కడికి అక్కడ రాస్తారోకో చేయాలని పిలుపు నిచ్చిన నేపథ్యంలో శనివారం మండల కేంద్రమైన శివ్వంపేట లో వీఆర్ఏలు తూప్రాన్ నర్సాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వీరి రాస్తారోకోతో రెండు వైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఏస్ఐ రవికాంత్ రావు తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని వారికి 15 నిమిషాల గడువు ఇచ్చారు. అయినా వారు ఆందోళన విరమించకపోవడంతో వీఆర్ఏలు అందరినీ అరెస్టు చేసి, స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత  వారందరినీ ఆయన సొంత పూచికత్తు పై విడుదల చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ  ఈ ప్రభుత్వం మొండి మొగుడు పెంకి పెళ్ళాం మాదిరిగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ప్రభుత్వ మొండివైఖరి విడనాడి మా న్యాయమైన డిమాండ్ లు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పే స్కేల్ ప్రకటించాలని, 50 సంవత్సరాలు నిండిన  వారికివారసత్వ ఉద్యోగం కల్పించాలని,అదేవిధంగా అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వం తమ డిమాండ్ పరిష్కరించిన యెడల తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసి, ఎక్కడికి అక్కడ ప్రజా జీవనాన్ని స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు బాలయ్య, ఉపాధ్యక్షుడు సత్తయ్య, కోశాధికారి నర్సింగరావు, నాయకులు శ్రీకాంత్, దుర్గేష్, నర్సింలు, మహేష్ తదితరులతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చినవారు పాల్గొన్నారు.