రాహుల్‌తో జరిగిన ఒప్పందం వెల్లడించాలి

కరీంనగర్‌ ఎంపి వినోద్‌ డిమాండ్‌

రాజన్నసిరిసిల్ల,నవంబర్‌15(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌, టీడీపీ మధ్య జరిగిన చీకటి ఒప్పందం బయటపెట్టాలని కరీంనగర్‌ ఎంపి వినోద్‌ కుమార్‌ అన్నారు. ప్రజా కూటమి ఓ విఫల కూటమి అని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ అన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దా కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నామన్న చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఆ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. రాహుల్‌గాంధీకి 25 ఎంపీ సీట్లు కావాలి. తెలంగాణలో 17 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అందుకే ఏపీతో రాహుల్‌గాంధీ ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందన్నారు. ప్రాజెక్ట్‌లను అడ్డుకునే వాళ్లంతా కూటమి పేరుతో పోటీ చేస్తున్నారని విమర్శించారు. కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ పార్టీకి అండగా నిలవాలని ప్రజలకు ఎంపి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ప్రజలను ఓట్లడిగే అర్హత ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో గ్రామాలకు రాని నాయకులు.. ఇప్పుడు మహాకూటమిగా ఏర్పడి, ఓట్లకోసం కల్లబొల్లి మాటలు చెప్పేందుకు వస్తున్నారనీ, వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులు పూర్తయితే, తెలంగాణలోని బీడు భూములు పచ్చని పంట పొలాలుగా మారుతాయని పేర్కొన్నారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు, ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మీ, షాదీమూబారక్‌లాంటి సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సర్కారు అండగా నిలిచిందని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే గ్రామాలన్నీ అభివృద్ది చెందుతున్నాయని తెలిపారు. గత పాలకులెవ్వరూ గ్రామాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఓట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆంధ్రాపార్టీతో దోస్తీ కట్టి, మహకూటమి పేరుతో వస్తున్నారనీ, ప్రజలు గమనించాలని కోరారు. ఆంధ్రాపాలకులు తెలంగాణ గడ్డపై కాలుమోపితే, మళ్లీ నీళ్లు, నిధులు అక్కడికి తరలించుకుపోతారని వ్యాఖ్యానించారు.