రాహుల్‌ను ప్రధానిని చేయడమే వైఎస్‌కు నివాళి
హైదరాబాద్‌లో వైఎస్ స్మృతివనం ఏర్పాటు చేయాలి
వైఎస్ బాటలోనే ముందుకు సాగుతున్న తెలంగాణకాంగ్రెస్
వైఎస్ విగ్రహం వద్ద నివాళి అర్పించిన రేవంత్ తదితరులు
హైదరాబాద్,జూలై8(జనంసాక్షి ): రాహుల్ గాంధీని ప్రధాని చేయడం వైఎస్సార్ చివరి కోరిక అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాస పాత్రుడు వైఎస్సార్ అని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల్లో ఆదరణ పొందిన నేత అన్నారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు వైస్సార్ అని చెప్పారు. రాహుల్ గాంధీనీ ప్రధాని చేసినప్పుడే వైఎస్సార్ ఆత్మకు శాంతి కలుగుతుందన్న రేవంత్ రెడ్డి.. వైఎస్సార్ గొప్ప రాజనీతజ్ఞుడు అన్నారు. వైఎస్సార్ కి హైదరబాద్‌లో స్మృతివనం లేకపోవడం అవమానకరం అన్నారు. కులసంఘాల భవనాలకు స్థలాలు ఇస్తున్న ప్రభుత్వం .. అలాగే వైఎస్సార్ స్మృతి వనం నిర్మించాలన్నారు. లేకపోతే 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వైఎస్సార్ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పీవీ, ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డిల మాదిరి.. హైదరాబాద్‌లో వైఎస్ స్ముతీవనాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ చేయకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్‌లో వైఎస్ స్ముతీవనం నిర్మిస్తామని తెలిపారు. వైఎస్సార్ స్ఫూర్తి తో పని చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో వైఎస్‌ఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి తెలంగాణ కాంగ్రెస్ నివాళులర్పించింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ… వైఎస్ చేపట్టిన నీటి ప్రాజెక్టులు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిని చేయటం తన లక్ష్యమని వైఎస్‌ఆర్ చెప్పేవారని గుర్తుచేశారు. వైఎస్‌ఆర్ ఆలోచనల మేరకు రాహుల్‌ను ప్రధానిని చేసే వరకు విశ్రమించమని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్ ఆలోచనలను తెలంగాణ కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్తోందన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి వైఎస్ అత్యంత విశ్వాసపాత్రడని అన్నారు. మాట ఇస్తే ఎన్ని కష్టాలొచ్చినా మడప తిప్పని నేత రాజశేఖరరెడ్డి అని అన్నారు. వైఎస్‌ఆర్ మన మధ్య లేకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి ఆవేదన చెందారు. మాట ఇస్తే.. మాట తప్పని నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని తెలంగాణ సీఎల్సీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వైఎస్‌ఆర్ చూపిన మార్గంలో తెలంగాణ కాంగ్రెస్ ముందుకు వెళ్తోందని, కష్టపడి పనిచేస్తున్నామన్నామని అన్నారు. వైఎస్‌ఆర్ హాయంలో అప్పటి ఏపీ అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే ముందుందన్నారు. నిరు పేదలకు ఇళ్ళు, రాజీవ్ ఆరోగ్య శ్రీ ఇచ్చిన మహా నాయకుడు వైఎస్ అని కొనియాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞాన్ని ప్రస్తుత పాలకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వైఎస్ కట్టిన ప్రాజక్ట్‌ల వలనే వ్యవసాయానికి నీళ్ళు అందుతున్నాయన్నారు. రైతుల కోసం ఉచిత కరెంటు గురించి మొదట ఆలోచన చేసి.. అమలు చేసింది వైఎస్‌ఆర్ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప మానవతావాది అని సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. మస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు వైఎస్‌ఆర్ పుణ్యమే అన్నారు. వైఎస్ వలనే హైదరాబాద్‌కు మెట్రో రైల్, పీవీ ఎక్స్ ప్రెస్ వే, కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘనత వైఎస్‌దే అన్నారు. రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని సీఎం కేసీఆర్ పని చేయాలని షబ్బీర్ అలీ సూచించారు. ఈ కార్యక్రమంలో కెవిపిరామచంద్రారవు, మాజీ ఎంపి
అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.