రాహుల్‌ మానస సరోవర్‌ యాత్ర లేదు

అలాంటి సమాచారం లేదన్న విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ,జూన్‌29(జనం సాక్షి): ఈ ఏడాది కైలాస్‌ మానససరోవర్‌ యాత్ర చేపట్టే విషయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నుంచి తమకు ఎలాంటి విజ్ఞప్తి అందలేదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ఆయన కైలాస్‌ యాత్రకు వెళతారంటూ వస్తున్న వార్తలను తోసిపుచ్చింది. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా టిబెటన్‌ అటానమస్‌ రీజియన్‌లో పర్యటనకు రాహుల్‌ నుంచి ఎలాంటి లాంఛనపూర్వకమైన విజ్ఞప్తి తమకు అందలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ విూడియాకు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కైలాస్‌ మానస సరోవర్‌ యాత్ర చేయాలని రాహుల్‌ తన కోరికను వెల్లడించినప్పటకీ ప్రత్యేక అనుమతి కోసం ఆయన చేసుకున్న విజ్ఞప్తికి విదేశాంగ శాఖ స్పందించలేదని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్న నేపథ్యంలో ఎంఈఏ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. సహజంగా ఈ వార్షిక యాత్ర చేపట్టాలంటే రెండు రకాల పద్ధతులుంటాయని రవీష్‌ కుమార్‌ తెలిపారు. మొదటిది ఎంఈఏ ఆర్గనైజ్డ్‌ రూట్‌లో వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం తమ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లే పేరు రిజిస్టర్‌ చేయించుకోవాలన్నారు. పారదర్శకంగా ఎంపిక ఉంటుందన్నారు. విూడియా సమక్షంలోనే యాత్రకు వెళ్లే వారిని ఎంపిక చేస్తామన్నారు. రాహుల్‌ పేరు యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో లేదని ఆయన తెలిపారు. ఇక…రెండవదైన ప్రైవేట్‌ రూట్‌లో ప్రైవైట్‌ ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా యాత్రకు వెళ్తుంటారని చెప్పారు. రాహుల్‌ గాంధీ ప్రత్యేక పర్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారా అని అడిగినప్పుడు, అలాంటి విజ్ఞప్తి ఏదీ తమకు అందలేదని ఆయన సమాధానమిచ్చారు