రివాజుగా మారిన ఓట్ల గల్లంతు
ఎన్నికలకు ముందే ఓట్ల గల్లంతుపై కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి గట్టిగా పోరాడారు. హైకోర్టులో కేసు వేశారు. అయినా తేలిందేవిూ లేదు. ఓట్ల నమోదు చేస్తున్నామని ఎన్నికల సంఘం చెప్పి తప్పించు కుంది. కానీ శుక్రవారం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో వేలాదిమంది తమ ఓటు గల్లంతయిన విషయాన్ని రోడ్లపైకి వచ్చి ఆక్రోశంగా చెప్పారు. ఓటరు కార్డు ఉన్నా ఓట్లు గల్లంతు అయితే దానికి ఇసిదే బాధ్యత. దీనికి ఎలాంటి చర్య తీసుకోబోతున్నారో చెప్పాలి. పౌరుడి ప్రాథమిక హక్కును కాలరాసిన ఇసి కార్యాచరణకు దిగాలి. ఎందుకు జాబితాలో పేర్లు గల్లంతు అవుతాయో చెప్పాలి. ఆధార్ కార్డు తీసుకున్నా, పాన్ కార్డు తీసుకున్నా పేర్లు రద్దు అన్న విషయమే ఉత్పన్నం కాదు. కానీ ఓట్లు జాబితాలోంచి ఎందుకు జారి పోతున్నాయి. క్రీడాకారిణ గుత్తా జ్వాలా కూడా తన ఓటు గల్లంతు అయినట్లు తెలిపింది. ఓ ఎన్‌ఆర్‌ఐ ప్రత్యేకంగా ఓటేయడానికి వచ్చి ఓటు గల్లంతయిన విషయం తెలుసుకుని నోరెళ్లబెట్టాడు. ఇదంతా ఓ రివాజుగా మారుతోంది. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా కనిపించాయి. ఇది ఎన్నికల సంఘం వైఫల్యమే కాకుండా బాధ్యతారహిత్య వ్యవహారంగానే చూడాలి. ఒక్కసారి ఓట్లు నమోదయ్యాక ఎందుకు తీసేయాలన్నదే ఇక్కడ ప్రశ్న. ఇంతగా టెక్నాలజీ అభివృద్ది చెందినా ఉపయోగించుకోవడంలో ఇసి విఫలం అవుతోంది. పక్కాగా నమోదు కార్యక్రమం జరగడం లేదు. దీంతో ఓటేయాలనుకున్న వారికి ఓట్లు ఉండడం లేదు. ఓటున్నా కొందరు ఓటేయలేక ఇంట్లో పడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఓట్లు గల్లంతైనట్లు వస్తున్న వార్తలు నిజం.. అర్హత ఉండీ, లిస్టులో పేరులేక ఓటు వేయలేకపోయిన వారిని క్షమాపణ కోరుతున్నానని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ చెప్పి, ఓ సారీ పడేసి పోయారు. మరోసారి ఇలా జరక్కుండా జాగ్రత్త పడతాం అని అంటున్న సీఈవో రజత్‌కుమార్ ఇందుకు ఎలాంటి చర్య తీసుకోబోతున్నారో చెప్పాల్సి ఉంది. ఓటరు జాబితాలో గుత్తా జ్వాల పేరు లేకపోవడం బాధాకరం. 2015లోనే ఆమె కుటుంబ సభ్యుల పేర్లు తొలగించారు. వారి నుంచి స్పందన లేకపోవడంతోనే పేరు డిలీట్ అయింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయిస్తాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ల నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలా ఎవురు డిలీట్ చేస్తున్నారన్నది కూడా ముఖ్యం. డిలీట్ చేసేముందు సదరు కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్ళి ఆరా తీస్తున్నారా లేదా అన్నది తెలియాలి. ప్రధానంగా ఎన్నికలు జరిగని ప్రతిసారీ ఓట్లు గల్లంతు కావడం, ఇవిఎంలు మొరాయించడం వంటివి చూస్తున్నాం. ఇలా జరక్కుండా చర్యలు తీసుకోలేమా అన్నది ఇసి సీరియస్‌గా ఆలోచన చేయాలి. ఇకపోతే పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌ను నిషేధించినప్పటికీ సెల్ఫీలు, వీడియోలు బయటికి రావడం కూడా అధికారుల నిర్లక్ష్యం తప్ప మరోటి కాదు. పార్లమెంట్ ఎన్నికల కోసం డిసెంబరు 26న నిర్వహించే ఓటర్ల జాబితా సవరణలో అర్హులైన ప్రతి ఒక్కరూ పేరు నమోదు చేయించుకోవాలని రజత్‌కుమార్ అంటున్నారు. అయితే నమోదు చేయించుకున్నా కూడా పేర్లు అందులో నమోదు కావడం లేదు. ఇలా ఎంతోమంది ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి ఈ ప్రక్రియను మార్చాల్సిన అసవరం ఉంది. పక్కా సాంకేతికతను పాటించాలి. ఇకపోతే ఎంతగా బతిమాలినా కొందరు ఓటేయడానికి బద్దకిస్తున్నారు. సెలవు వస్తే ఎంజాయ్ చేయడం, సినిమాకు చెక్కేయడం మినహా ఓటేయాలన్న బాధ్యతను గుర్తించడం లేదు. ఓటేయని వారికి కూడా శిక్ష పడేలా చూడాలి. ఏ కారణం చేత ఓటేయలేకపోతున్నారో తెలియాలి. తెలంగాణ శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినా కేవలం 69.1 శాతం పోలింగ్ నమోదయింది. కనీసం ఓ 80శాతం ఖచ్చితంగా నమోదు అయివుంటే కొంతలో కొంతయినా మార్పు కనిపించేది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలోని మధిర
నియోజకవర్గంలో 91.27 శాతం ఓటింగ్ నమోదయింది. అత్యల్ప పోలింగ్ రాజధాని పరిధిలోని మలక్‌పేటలో జరిగింది. ఇక్కడ కేవలం 40 శాతం మంది మాత్రమే ఓటేశారు. తమ సమస్యలు పరిష్కరించలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రజలు పోలింగ్‌ను కొన్ని గంటల పాటు బహిష్కరించారు. అధికారుల జోక్యంతో ఆ ఓటర్లు ఓటేయడానికి అంగీకరించారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగిసింది. ఆయా నియోజకవర్గాల్లో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఓట్లు గల్లంతు కావడంపై ఇసి సీరియస్‌గా ఆలోచన చేయాలి. అలాగే ప్రజలు కూడా ఓటు వేయడానికి బద్దికించకుండా బాధ్యతగా ముందుకు రావాలి. ప్రజాస్వామయ్యంలో ఓటేయడంతో పాటు, ఓటు కలిగి ఉండడం కూడా అతి ముఖ్యమైన విషయం కావాలి. మన ఓటు ద్వారానే పాలకులను ఎన్నికుంటామన్న స్పృహ లేనివారు అత్యధికులుల చదువుకున్న వారే కావడం గమనార్హం. ఓటేయని వారికి ప్రభుత్వాన్ని గురించి విమర్శించే అర్హత లేదు. అలాగే సౌకర్యాల గురించి మాట్లాడే అవసరం అంతకన్నా లేదు. అసలు ప్రశ్నించడానికే పనికిరాడు. ప్రజలు తమవిధిగా ఓటు నమోదు చేయించుకోవడం,ఓటేయడం తప్పనిసరి చేయాలి. ఇసి కూడా ఓటునమోదు ప్రక్రియను సరళతరం చేసి, నమోదైన ఓట్లు గల్లంతు అన్న పదం లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఇలాంటి సమస్యలు రావు.