రుణంపైనే ఆధారపడ్డ రైతన్నల సేద్యం
రుణంపైనే ఆధారపడ్డ రైతన్నల సేద్యం
తీరుతో సకాలంలో అందని రుణాలు
జగిత్యాల,జూలై11(జనం సాక్షి): పంటరుణాల పంపిణీలో జగిత్యాల జిల్లాలో కనీసం 50శాతం మంది రైతులకు కూడా చేరడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు పంటరుణ పరిమితి అమలు లేకపోగా కిసాన్‌క్రెడిట్ కార్డులు ఊసేలేదు. నిబంధనల ప్రకారం పంటరుణం తీసుకునే ప్రతిరైతుకు కిసాన్‌క్రెడిట్ కార్డును ఇవ్వాలి. రైతు ఖాతాలో బ్యాంకర్లు రుణం నిధులను జమచేసిన తరువాత రైతు వాడుకున్న మొత్తానికే వడ్డీ చెల్లించాలి. రైతుకు ఒకేసారి నిధులు అవసరం ఉండవు. పంట సాగునుంచి చివరి వరకు దఫాలుగా నిధులు అవసరం ఉంటాయి కాబట్టి ఖాతాలో నుంచి కార్డుద్వారా అవసరం ఉన్నపుడు తీసుకుని తిరిగి ఖాతాలో జమచేసే వీలుండాలి. దీనివల్ల రైతులకు ఎప్పుడూ నిధులు అందుబాటులో ఉంటాయి, వడ్డీ తగ్గుతుంది. పంటకాలంలోనైనా తమకు పంటరుణాలు దక్కుతాయని అన్నదాతలు ఆశలు పెంచుకున్నారు. జిల్లాలో సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉండగా వీరికి ప్రభుత్వం అందించే పంటరుణాలే ఆధారం కానున్నాయి. గతకొన్ని సీజన్లుగా పంటరుణాల పంపిణీ లక్ష్యానికి దూరంగానే నిలిచిపోతుండగా కౌలు రైతులకు సైతం పంటరుణాల పంపిణీ దరిచేరడం లేదు. రైతులకు ఒకేసారి రుణమొత్తాన్ని చెల్లించి ఒకేసారి వసూలు చేస్తున్నారు. మరోవైపు పంటరుణ పరిమితి ఒక్కో పంటకు ఒక్కో రకంగా ఉంటున్నా ఈ పరిమితి మేరకు ఇవ్వడం లేదు. జిల్లాలో జాతీయ, గ్రావిూణ, సహకార బ్యాంకులుండగా వీటిద్వారా రైతులకు రుణాలను అందిస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లో పంటరుణాల మంజూరు, రెన్యూవల్స్ రైతులకు తలకుమించిన భారంగా మారుతోంది. మరోవైపు జిల్లాలో కౌలురైతులుంటారు కాబట్టి వీరిరికూడా వచ్చే వానాకాలం పంటరుణాన్ని దరిచేర్చేలా చర్యలుండాలి. కనీసం వచ్చే పంటకాలంలోనయినా వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసినపుడే రైతులకు పంటరుణాల పంపిణీ లక్ష్యం నెరవేరుతుంది. రైతులకు పంట రుణంతో పాటుగా స్వల్ప, ధీర్ఘకాలిక, భూమి అభివృద్ధి, బావుల తవ్వకం, మోటార్లు, పైపులైన్లకు కూడా
రుణాలను మంజూరివ్వాల్సి ఉంటుంది.