రుణమాఫీలతో సమస్య పరిష్కారం కాదు

వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాలి

పాలకులకు వెంకయ్య నాయుడు సూచన

పుణె,జూన్‌22(జ‌నం సాక్షి ): రైతులకు రుణమాఫీ పరిష్కారం కాదని.. దీర్ఘకాలంలో అది వ్యవసాయ రంగం, బాధిత రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గతంలో ఇదే అంశంపై ఆయన కేంద్రమంత్రిగా ఉండగా పదేపదే ఇదే హెచ్చరిక చేశారు. వ్యవసాన్ని, అనుబంధరంగాలను ప్రోత్సహించాలే తప్ప మాఫీలతో సమస్యలను పరిష్కరించలేమన్నారు. తాజాగా మరోమారు పుణె వేదికగాఇదే విషయం చెప్పారు. రుణమాఫీలతో రైతులను ఆకట్టుకోవాలనుకుంటున్న వారికి వెంకయ్య నాయుఏడు వ్యాఖ్యలు శరాఘాతం లాంటివే. దేశంలో చాలామంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని.. వారి ఆదాయాన్ని పెంచడం చాలా అవసరమన్నారు. సంప్రదాయ వ్యవసాయంతో పాటు పౌల్టీ పాడి, మత్య్స పరిశ్రమ వంటి వ్యవసాయ అనుబంధ రంగాల దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. దీనివల్ల అన్నదాతలు కావాల్సినంత ఆదాయాన్ని పొందుతారని.. తద్వారా ఆత్మహత్యలు చేసుకోరని అభిప్రాయపడ్డారు. ‘వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ఎలా’ అనే అంశంపై పుణెలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతు అనుకూల విధానాలను తేవాలన్నారు. వారు స్వయం సమృద్ది సాధించేలా చూడాలన్నారు. అంతేగానీ అదేపనిగా మాఫీలు మంచివి కావన్నారు.