రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న
ఎస్సీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు
నిజామాబాద్,ఆగస్ట్11(జనం సాక్షి): ఎడపల్లి మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల నుంచి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు పొందేందుకుగాను దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ శంకర్, బ్యాంక్ అధికారులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండల వ్యాప్తంగా రెరడు లక్షలలోపు రుణాలు కావాలంటూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 45 మంది అన్ స్కిల్‌డ్ల్ అభ్యర్థులకుగాను మౌఖిక పరీక్షకు ఆరుగురు గైర్హాజరయ్యారని, ఎస్సీ రుణాల మంజూరు కోసం అధికమొత్తంలో అభ్యర్థులు పేపర్ ప్లేట్స్ తయారీ కోసం దరఖాస్‌త్తు చేసుకోగా, కొందరు మాత్రం కిరాణాదుకాణం, పిండి గిర్ని వంటి తదితర వ్యాపారాలు నెలకొల్పడానికి దరఖాస్తు చేసుకున్నారని ఎంపీడీఓ శంకర్ తెలిపారు. మొత్తం మండల వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న వారికి మౌఖిక పరీక్షలు నిర్వహించి, వారిలో నుంచి ఎనిమిది మందిని ఎంపిక చేస్తామని, ఎంపిక చేసిన వారికి ఎస్సీ రుణాల మంజూరు కోసం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయానికి అందించి, తద్వారా స్థానిక బ్యాంకుల నుంచి లబ్ధిదారులకు రుణ మొత్తాన్ని అందజేస్తామని ఎంపీడీఓ తెలిపారు. స్వయం ఉపాధిలో భాగంగా ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఎస్సీ కార్పొరేషన్ రుణాలను ఎంపికైన అభ్యర్థులు
సద్వినియోగం చేరుకొని ఆర్ధికంగా స్థిరపడాలని ఎంపీడీఓ సూచించారు. మౌఖిక పరీక్షల్లో ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, ఎంపీఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ మనోహర్ రెడ్డి, ఏపీఎం సాయిలు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.