రూపాయి బలోపేతానికి చిదంబరం మార్క్‌ కసరత్తు


ఆర్థిక సర్వే నివేదికను సభలో ప్రవేశపెట్టిన విత్త మంత్రి
సబ్సిడీలపై కోత.. వృద్ధి రేటు ఆరు లోపే
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) :
రూపాయి బలోపేతానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. ఆర్థిక సర్వే నివేదికను ఆయన బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక వృద్ధి రేటును 6.1నుంచి 6.7శాతానికి పెంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. గతంలో ఆర్థిక వృద్ధిరేటు 5శాతానికి పడిపోయిన విషయం విదితమే. వృద్ధిరేటు క్షిణతను కట్టడి చేయడమే ప్రధాన అంశంగా ఆర్థిక సర్వే రూపొందించారు. ప్రభుత్వ ప్రధాన ఆర్థిక వేత్త రఘురాంరాజన్‌ నేతృత్వంలో రూపొందించిన ఈ నివేదిక వృద్ధిరేటును ఊపందుకునేలా చేసేందుకు పలు చర్యలను సూచించింది. దేశీయంగా అంతర్జాతీయంగా దేశ ఆర్థిక వ్యవస్థను కుంటుపరుస్తున్న పలు ప్రతీకూల అంశాలను చర్చించింది. ఆర్థిక బడ్జెట్‌ ప్రవేశపెట్టబోయే ముందు ఈ సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆర్థికమంత్రి చిదంబరం విడుదలచేశారు.
ఈ మధ్యకాలంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న పారిశ్రామికోత్పత్తిని, క్రమంగా క్షీణిస్తున్న ఎగుమతులను గాడిలో పెట్టడానికి తీసుకోవలసిన చర్యలకు ఈ ఆర్థిక సర్వే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే సబ్సిడీలు తగ్గించుకోవాలని వస్తు సేవల పన్ను కొత్త ప్రత్యక్ష పన్నుల చట్టాన్ని సాధ్యమైనంత త్వరలో తీసుకురావాలని సర్వే పేర్కొంది. అలాగే పసిడి దిగుమతులను నియంత్రించడం ద్రవ్యలోటు, ప్రస్తుత సీఏడీ తగ్గించడంపై సర్వే దృష్టి సారించింది. రాబోయే కాలంలో ధరల పెరుగుదల ఏ మేరకు ఉంటుందో సర్వేలో పేర్కొన్నారు. కాగా, ప్రముఖ ఆర్థిక వేత్త జహంగీర్‌ అజీస్‌ ఆర్థిక సర్వేపై మాట్లాడుతూ గాడిలో పెట్టాల్సిన ఆర్థిక వ్యవస్థకు అనేక మరమ్మతులు చేయాల్సి ఉందని, అదే విధంగా ఆర్థిక సంస్థల వల్ల అంతర్జాతీయంగా వచ్చే ఒడిదుడుకులను తట్టుకునేందుకు పలు చర్యలు చేపట్టాల్సి ఉందని, అప్పుడే నిదానంగా ఆర్థిక వృద్ధి రేటు సాధించగలమని తెలిపారు.
ద్రవ్యోల్బణం 6.2 నుంచి 6.6శాతానికి మార్చికల్లా పెరిగినట్లు సర్వేలో పేర్కొన్నారని పెట్టుబడులు పెరగడం వల్ల ధరలను తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. ఎస్‌ బ్యాంక్‌ సీనియర్‌ ప్రెసిడెంట్‌, ప్రముఖ ఆర్థిక వేత్త సుబ్బారావు మాట్లాడుతూ ధరల పెరుగుదలకు ఎగుమతుల కారణం ఒకటని, ఆర్థికి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలలో భాగంగా రిజర్వు బ్యాంక్‌ రేట్లను సవరించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
నేడు సభ ముందుకు బడ్జెట్‌..
మరి కొన్ని గంటల్లో కేంద్ర బడ్జెట్‌ పార్లమెంటు ముందుకు రానున్నది. మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేయనున్నారా.. సంఘటిత, అసంఘటిత రంగాల వారి వృద్ధికి, రైతులకోసం కొత్త పథకాలు చేపట్టనున్నారా.. ఉద్యోగులకు ఎంతమేర ఊరట కలిగించనున్నారా.. నిత్యావసర వస్తువుల ధరలు.. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, టీవీలు, సిగరెట్లు ధరలు మరింత పెరగనున్నాయా అన్న విషయం తెలుసుకునేందుకు గురువారం ఉదయం 11 గంటల వరకు వేచి ఉండాల్సిందే.
ఎందరో మహానుభావులు..
ఎందరో మేధావులు ఇప్పటివరకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.. వారిలో కొందరు ప్రధానులు కూడా ఉండడం విశేషం. బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన మాజీ మంత్రుల గురించి మరోమారు తెలుసుకుందాం. జవహర్‌లాల్‌ నెహ్రూ 1951లో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టారు. ఆయన ఒక్కసారి మాత్రమే ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందిరాగాంధీ కూడా ఆర్థికమంత్రిగా ఒక్కసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1962-63లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీదేశాయ్‌కి దక్కింది. ఇందిరాగాంధీ హయాంలో బ్యాంకుల జాతీయకరణ జరిగింది. సాంకేతిక ప్రగతికి రాజీవ్‌గాంధీ తెరదీశారు. ఆర్థిక సరళీకరణకు అప్పటి ఆర్థికమంత్రిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌ 1991లో శ్రీకారం చుట్టారు. బడ్జెట్‌ ప్రవేశ పెట్టే సమయంపై కొత్త సంప్రదాయానికి యశ్వంత్‌ సిన్హా శ్రీకారం చుట్టారు. బ్రిటీష్‌ హయాం నుంచి సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. దాన్ని యశ్వంత్‌సిన్హా బ్రేక్‌ చేశారు. ఉదయమే పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆర్థిక మంత్రిత్వశాఖలకు షణ్ముఖం, వీపీసింగ్‌, మన్మోహన్‌సింగ్‌, చిదంబరం వన్నె తెచ్చారు.. తెస్తున్నారు.. ఇదిలా ఉండగా 2013-2014 ఆర్థిక బడ్జెట్‌ను గురువారం ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
1946-47 బడ్జెట్‌ను లియాకత్‌ ఆలీఖాన్‌
1947-49 బడ్జెట్‌ను షణ్ముఖంచెట్టి
1949-51 బడ్జెట్‌ను జాన్‌ మతాయి
1951-1957 బడ్జెట్‌ను సిడి దేశ్‌ముఖ్‌
1957-1958 బడ్జెట్‌ను టిటి కృష్ణమాచారి
1958-1959 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రిగా జవహర్‌లాల్‌ నెహ్రూ 1959-1964 బడ్జెట్‌ను మొరార్జీ దేశాయ్‌
1964-1965 బడ్జెట్‌ను టిటి కృష్ణమాచారి
1965-1967 బడ్జెట్‌ను సచింద్ర చౌదరి
1967-1970 బడ్జెట్‌ను మొరార్జీదేశాయ్‌
1970-1971 బడ్జెట్‌ను ఇందిరాగాంధీ
1971-1975 బడ్జెట్‌ను యశ్వంతరావు చవాన్‌
1975-1977 బడ్జెట్‌ను సి.సుబ్రహ్మణ్యం
1977-1979 బడ్జెట్‌ను హెచ్‌ఎం పటేల్‌
1979-1980 బడ్జెట్‌ను చరణ్‌సింగ్‌
1980-1982 బడ్జెట్‌ను ఆర్‌.వెంకట్రామన్‌
1982-1985 బడ్జెట్‌ను ప్రణబ్‌ముఖర్జీ
1985-1987 బడ్జెట్‌ను విపిసింగ్‌
1987-1989 బడ్జెట్‌ను ఎస్‌బి చవాన్‌
1989-1990 బడ్జెట్‌ను మధుదండావతె
1990-1991 బడ్జెట్‌ను యశ్వంత్‌సిన్హా
1991-1996 బడ్జెట్‌ను మన్మోహన్‌సింగ్‌శ్రీ1996-1998 బడ్జెట్‌ను పి.చిదంబరం
1998-2002 బడ్జెట్‌ను యశ్వంత్‌సిన్హా
2002-2004 బడ్జెట్‌ను జస్వంత్‌సింగ్‌
2004-2008 బడ్జెట్‌ను పి.చిదంబరం
2009-2012 బడ్జెట్‌ను ప్రణబ్‌ముఖర్జి
2012-2013 బడ్జెట్‌ను పి.చిదంబరం