రెండంకెల వృద్ధి రేటు లక్ష్యం

– 2017-18లో 7.7శాతం వృద్ధిరేటు సాధించా
– నాలుగేళ్లలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించాం
– ప్రధాని నరేంద్ర మోదీ
– వాణిజ్య మంత్రిత్వ శాఖ సంబంధిత నూతన కార్యాలయానికి మోదీ శంకుస్థాపన
న్యూఢిల్లీ, జూన్‌22(జ‌నం సాక్షి ) : భారత వృద్ధి రేటును రెండంకెలకు పెంచడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ వెల్లడించారు. దాంతో పాటు ప్రపంచ వాణిజ్యంలో భారత వాటాను రెట్టింపు చేసే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. న్యూఢిల్లీలో శుక్రవారం వాణిజ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన కొత్త కార్యాలయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించామని, కరెంటు ఖాతా లోటును అదుపులో ఉంచామని ఆయన వెల్లడించారు. 2017-18 ఆర్థిక సంత్సరానికి 7.7శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించామని, అయితే 7-8 శాతం వృద్ధి రేటును దాటి, రెండంకెల వృద్ధి రేటును సాధించడమే లక్ష్యమని తెలిపారు. భారత్‌ ఆర్థిక వ్యవస్థ 5ట్రిలియన్‌ డాలర్ల ఎకానవిూలోకి ఎప్పుడు చేరుతుందా? అని ప్రపంచం మనవైపు చూస్తోందని అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ వాటాను రెట్టింపు చేయడమే కేంద్రం లక్ష్యమన్నారు. దేశీయ తయారీ రంగాన్ని పెంచడం ద్వారా దిగుమతుల విూద ఒత్తిడి తగ్గుందని తెలిపారు. పనిని ఆలస్యం చేసే సంస్కృతికి భారత్‌ దూరంగా జరిగిందని, అదే తమ ప్రభుత్వం సాధించిన విజయమన్నారు. జులై 1 నుంచి జీఎస్టీ అందుబాటులోకి రావడం వల్ల వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పడటంతో పాటు, పన్నుల పరిధి కూడా పెరిగిందన్నారు. జీఎస్టీ కింద కొత్తగా 54 లక్షల మంది పన్ను చెల్లింపు దారులు రిజిస్టేష్రన్‌ చేయించుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ నాలుగేళ్ల కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలోకి పెద్ద ఎత్తున రావడంతోపాటు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు రికార్డు స్థాయిలో పెరిగాయని ప్రధాని పేర్కొన్నారు.