రెండున్నర లక్షల మంది టార్గెట్
తరలింపు బాధ్యత ఎమ్మెల్యేలదే
కరీంనగర్,ఆగస్ట్25(జనం సాక్షి): పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రగతి నివేదన సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రెండున్నర లక్షల మంది ప్రజలను తరలించాలని నిర్ణయించారు. ఈ విషయంపై శుక్రవారం జిల్లా మంత్రి ఈటల రాజేందర్ ఆధ్యక్షతన హైదరాబాద్‌లోని మంత్రి క్వార్టర్స్‌లో సమావేశం జరిగింది. ఇందులో ప్రజాప్రతినిధులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనసవిూకరణపై దృష్టిపెట్టి అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాలనుంచి వీలైనంత ఎక్కువ మందిని తరలించాలని భావించడమేకాకుండా.. ఒక్కో నియోజకవర్గానికి టార్గెట్ పెట్టుకున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో సమావేవాలు పెట్టుకుని సమయాతం చేయబోతున్నారు. ఇందుకోసం 3500ల ఆర్టీసీ బస్సులు అవసరం పడుతాయని భావించిన ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ బస్సులు 900లు మాత్రమే ఉన్న నేపథ్యంలో మిగిలిన జిల్లాల నుంచి మాట్లాడుతున్నారు. అలాగే వివిధ ప్రైవేటు అసోసియేషన్ల వాహనాలు తీసుకోవాలని నిర్ణయించారు. బస్సులు, వీలైనన్ని ఇతర వాహనాల్లో ప్రజలను తరలించడంతో పాటు సురక్షితంగా తిరిగి ఇంటివరకు చేర్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలను నియమిస్తున్నట్లు మంత్రి ఈటల తెలిపారు. ఏ గ్రామం నుంచి ఎంత మంది వస్తారో ముందుగానే నిర్ణయించి వారికి అనుగుణంగా వాహన, భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సభకు వచ్చే ప్రజల యోగక్షేమాలను పూర్తిస్థాయిలో చూసే విధంగా టీఆర్‌ఎస్ శ్రేణులను సిద్ధం చేయాలని మంత్రి ప్రజా ప్రతినిధులకు సూచించారు. సభ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి.నాలుగున్నరేళ్ల పాలన తదుపరి చేయబోతున్న ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 25 లక్షల మందిని తరలించాలని నిర్ణయించిన పార్టీ అధిష్టానం ఈ మేరకు జిల్లా పార్టీ శ్రేణులకు అదేశాలు ఇచ్చింది. కరీంనగర్ జిల్లా నుంచి వీలైనంత ఎక్కువ మందిని తరలించాలని నిర్ణయించారు.



