రెండుమూడు సీట్లంటే.. ఒప్పుకోం
– 40చోట్ల గెలుపోటములను నిర్ణయించే సత్తామాకుంది
– నాకు అవకాశం వస్తే హుస్నాబాద్ నుంచే పోటీ చేస్తా
– కూటమి ఏర్పాటుతో టీఆర్‌ఎస్‌లో భయం పట్టుకుంది
– దేశవ్యాప్తంగా మోడీ పాలనలో వ్యవస్థలు గందరగోళంలో పడ్డాయి
– అవినీతి, లంచగొండితనం పెరిగిపోయింది
– సీబీఐలో వెలుగు చూసిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి
– విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
కరీంనగర్, అక్టోబర్23(జనంసాక్షి) : మహాకూటమి చర్చల్లో మాకు మూడు సీట్లు మాత్రమే అని ఎప్పుడూ అనకపోయినా, బయటకు లీకులిస్తున్నారని, రెండుమూడు సీట్లు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చాడ మాట్లాడారు. 40చోట్ల గెలుపు ఓటములను ప్రభావితం చేసే సత్తా మాకుందని అన్నారు. నాకు అవకాశం వస్తే హుస్నాబాద్ నుంచే చేస్తానని, లేదంటే ఖాళీగా ఉంటానని, రామగుండం నుంచి పోటీ చేయనన్నారు. మహాకూటమిలో మాకు 12స్థానాలడిగామని, 9 చోట్ల పేర్లు ఇచ్చామన్నారు. తెలంగాణలోని ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లాంటి చోట్ల మా ప్రాతినిధ్యం కావాలన్నారు. ఓ సీటు అటూ ఇటైనా సర్ధుకుపోతామని కోదండరాం చెప్పారని చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. మహాకూటమి ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్ లో భయం పట్టుకుందని, ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైనందునే మేము కూటమిగా ఏర్పడాల్సి వచ్చిందని చాడ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంపై పెను ఆర్థికభారం పడబోతోందన్నారు. దేశవ్యాప్తంగా మోడీ పాలనలో వ్యవస్థలు గందరగోళంలో పడ్డాయన్నారు. న్యాయ వ్యవస్థలోనే అవకతవకలు జరుగుతున్నాయని నలుగురు న్యాయమూర్తులు ఆరోపించడం, సీబీఐ ఉన్నతాధికారులు అవినీతి అధికారుల పాత్ర వంటివి ఇందుకు ఉదాహరణలని అన్నారు. దేశ వ్యాప్తంగా అవినీతి, లంచగొండితనం పెరిగిపోతున్నాయన్నారు. బేటీ పడావో- బేటీ బచావో అపహాస్యం పాలవుతోందన్నారు. నరేంద్ర మోడీ 2014లో ఇచ్చిన ‘స్వపరిపాలన సుపరిపాలన నినాదం’ ఎక్కడుందని ప్రశ్నించారు. సీబీఐలో వెలుగు చూసిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. గతఎన్నికల్లో భారీ నగదుతో పట్టుబడిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని సీఈసీ అధికారులను అడిగానని, రూ.28 లక్షలు మాత్రమే ఎన్నికల ఖర్చు పెట్టాలన్న నిబంధన ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ఒక్కో అభ్యర్థి రూ.10 కోట్ల దాకా ఖర్చు చేసి గెలవాలని చూస్తున్నట్లు తెలిపారు. ఇన్ని ఎన్నికల్లో ఏ పార్టీకి 51 శాతం ఓట్లు రాలేదని, ఎన్నిక ప్రక్రియలో మార్పు రావాలన్నారు.