రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో గుత్తేదారుల వెనకంజ
మహబూబ్‌నగర్,మే16(జనం సాక్షి): డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో కంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇందులో మార్జిన్ తక్కువగా ఉండడమే కారణమని తెలుస్తోంది. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత 14 నియోజకవర్గాల్లో వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎక్కువ మొత్తంలో మార్జిన్ ఉండే పనులపై మొగ్గు చూపుతున్న గుత్తేదారులు రెండు పడకల ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన ఇళ్ల నిర్మాణానికి సంబంధిత అధికారులు అనేక పర్యాయాలు టెండర్లు పిలిచినా.. ఎవరూ ముందుకు రావడం లేదు. వేలాది కోట్లతో చేపడుతున్న నీటి పారుదల ప్రాజెక్టులు, కాల్వల పునరుద్దరణ, రహదారులు, భవనాలు, చెరువులు, పైపులైన్ నిర్మాణాలు తదితర అభివృద్ధి పనుల కోసం పోటీ పడుతున్న గుత్తేదారులు ఈ ఇళ్ల నిర్మాణాలపై ఆసక్తి చూపడం లేదు. త్వరితగతిన లబ్దిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్లు, పథక సంచాలకులు బాధ్యత వహించాలని ఆ ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు మంజూరైన రెండు పడక గదుల ఇళ్లకు తోడు, అదనంగా నియోజకవర్గానికి వేయి ఇళ్లను మంజూరు చేసింది. రాష్ట్రంలోని 95 నియోజకవర్గాలకు వెయ్యి చొప్పున మంజూరు చేసిన ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు 14వేల ఇళ్లను కేటాయించింది. మురికివాడల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంతి కె.చంద్రశేఖర్‌రావు హావిూ మేరకు
జిల్లా కేంద్రంలోని పాత పాలమూరు, పాతతోట, వీరన్నపేటకు కేటాయించిన ఇళ్లు కలిపితే.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు మంజూరైన రెండు పడకగదుల ఇళ్ల సంఖ్య 21,900కు చేరింది. చాలా చోట్ల స్థలాలు, లబ్దిదారుల ఎంపిక ప్రహసనంగా మారగా ఈ రెండు పూర్తయిన చోట నిర్మాణాలకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో పథకం ముందుకు సాగడం లేదు. సాక్షాత్తు గృహ నిర్మాణ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నోడల్ అధికారి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, అధికారులతో పలుమార్లు సవిూక్ష జరిపినా.. ప్రజా ప్రతినిధులు చొరవ చూపుతున్నా.. టెండర్లలో గుత్తేదారులు ముందుకు రాకపోవడమే అసలు సమస్యగా మారింది.