రెండు రోజుల్లో రూ.3.5లక్షల వసూళ్లు

– ప్లాస్టీక్‌ నిషేదాన్ని అతిక్రమించినందుకు జరిమానాలు
ముంబయి, జూన్‌25(జ‌నం సాక్షి ) : మహారాష్ట్రలో ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని శనివారం నుంచి అమల్లోకి తెచ్చారు. దీంతో బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ అధికారులు దుకాణాలు, వ్యాపారాలపై దాడులు చేసి ప్లాస్టిక్‌ వాడితే జరిమానాలు విధిస్తున్నారు. ఆదివారం వరకు అంటే రెండ్రోజుల్లో బీఎంసీ అధికారులు 87దుకాణాలపై దాడులు నిర్వహించారు. జరిమానాల రూపంలో దాదాపు రూ.3.5లక్షలు వసూలు చేశారు. దీంతో ముంబయిలోని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తోంది. ప్లాస్టిక్‌ నిషేధంపై బుధవారం నుంచి ధర్నా చేస్తామని తెలిపింది. వర్షాకాలం ముగిసేవరకు ప్లాస్టిక్‌పై నిషేధాన్ని వాయిదా వేయాలని, రీసైకిల్‌ చేయగలిగే ప్లాస్టిక్‌ను తిరిగి కొనుగోలుకు అనుమతించాలని రిటైలర్స్‌ అసోసియేషన్‌ కోరుతోంది. తమ డిమాండ్లు నేరవేరకపోతే ధర్నా చేస్తామని హెచ్చరిస్తోంది. కిరాణా దుకాణాలు, స్వీటు షాప్స్‌, తదితర దుకాణాల్లో ప్లాస్టిక్‌ చాలా అవసరమని, కేవలం విక్రయించడానికే కాకుండా పదార్థాలు నిల్వ ఉంచడానికి ప్లాస్టిక్‌ కవర్లు అవసరమవుతాయని, ముఖ్యంగా వర్షాకాలంలో చాలా అవసరమని అసోసియేషన్‌ ప్రెసిడింట్‌ వీరేన్‌ షా వెల్లడించారు. అధికారులు దాడులు చేసి జరిమానాలు విధిస్తారనే భయంతో చాలా మంది దుకాణాలు మూసేశారని చెప్పారు.