రెండు లేఖలు సిద్ధం చేశాం 

– గవర్నర్‌ అనుమతివ్వగానే సమర్పిస్తాం
– కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌
బెంగళూరు, మే16(జ‌నం సాక్షి) : కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా కాంగ్రెస్‌-జేడీఎస్‌ ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీఆజాద్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జేడీఎస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నేతగా ఎన్నికైన కుమార స్వామికి మద్దతిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడు, జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామి సంయుక్తంగా గవర్నర్‌కు రెండు లేఖలు రాసినట్లు చెప్పారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ లెజిస్లేచర్‌ పార్టీల నిర్ణయాలను ఈ లేఖల్లో వివరించినట్లు పేర్కొన్నారు. గవర్నర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరామన్నారు. గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తే ఈ లేఖలను సమర్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన దాని కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమికి ఉన్నట్లు చెప్పారు. బీజేపీకి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. సుప్రీంకోర్టు 14 నెలల క్రితం ఇచ్చిన
తీర్పులో సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీ కన్నా మిగిలిన పార్టీల కూటమికి ఎమ్మెల్యేల బలం ఉంటే, ఆ కూటమికే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చెప్పిందన్నారు. దీనిని గవర్నర్‌ దృష్టిలో ఉంచుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ తీర్పును గవర్నర్‌ నిర్లక్ష్యం చేయరని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేల బలం లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినట్లయితే, అది రాజ్యాంగ విరుద్ధమవుతుందని స్పష్టం చేశారు.