రెండోవిడతకు సర్వం సిద్దం

నూకాలంపాడు గ్రామపంచాయతీలో ఎన్నికలు వాయిదా

ఖమ్మం,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలో రెండో విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో రెండో విడత ఎన్నికలు 204 గ్రామ పంచాయతీలు, 1862 వార్డుల్లో ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించారు. 169సర్పంచ్‌, 1376 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ విడతలో ఏన్కూర్‌

మండలంలోని నూకాలంపాడు గ్రామపంచాయతీలో ఎన్నికలు వాయిదాపడ్డాయి. అలాగే 35 సర్పంచ్‌, 469 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ విడతలో 17 వార్డులు గిరిజనులకు రిజర్వుకావడంతో అభ్యర్థులు లభించక ఎన్నికలు వాయిదావేశారు. రెండవ విడతలో ఏన్కూర్‌, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూర్‌, సింగరేణి మండలాల్లో ఎన్నికలు జరగుతాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా అధికారులు ఆయా గ్రామాల్లో ఏర్పాట్లు చేసేందుకు రంగంలోకి దిగారు. ఏన్కూర్‌ మండలంలోని నూకాలంపాడు గ్రామపంచాయతీ ఎస్టీ జనరల్‌ రిజర్వు కావడంతో అక్కడ నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో ఆ పంచాయతీలో ఎన్నికలను అధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు. కొన్ని గ్రామపంచాయతీలలో వార్డులకు, సర్పంచ్‌ పదవులకు రిజర్వేషన్‌ కేటాయించిన అభ్యర్థులు లేకపోవడంతో ఎన్నికలు జరగడం లేదు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లలో వార్డులకు సంబంధించిన వాటిలో ఏన్కూర్‌ మండలంలో 8 వార్డులలో నామినేషన్లు వేయలేదు. నూకాలంపాడు పంచాయితీలు 6, ఆరెకాయలపాడు పంచాయితీలు 2 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. తల్లాడ మండలంలో ఒక వార్డుకు నామినేషన్లు దాఖలు కాలేదు. మండలంలోని కొడవటి మిట్ట పంచాయితీలు ఎస్టీ మహిళకు కేటాయించిన వార్డులో అభ్యర్థి లభించకపోవడంతో నామినేషన్‌ దాఖలు కాలేదు. పెనుబల్లి మండలంలో 4 వార్డులకు నామినేషన్లు రాలేదు. వాటిలో గౌరారం పంచాయితీలో 4 వార్డులు గిరిజనులకు కేటాయించడంతో అక్కడ నామినేషన్లు వేసేవారు లేరు. సింగరేణి మండలంలోని నాలుగు వార్డులకు నామినేషన్లు వేసేవారు ఎవరులేరు. మండలంలోని కొత్తకమలాపురం గ్రామపంచాయితీలో ఎస్టీలకు కేటాయించిన వార్డులలో నామినేషన్లు వేయలేదు. దీంతో ఈ స్థానాల్లో ఎన్నికలను అధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు.

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 204 సర్పంచ్‌, 1862 వార్డు సభ్యుల పదవులకు నామినేషన్ల పక్రియ ముగిసి ఉపసంహరణ పూర్తి అయిన తరువాత 34 పంచాయితీలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఏకగ్రీవ పంచాయతీల్లో ప్రజలు ఆనందోత్సవాలను జరుపుకుంటున్నారు. మొదటి విడతలో గెలిచిన గ్రామాల్లో ప్రజలు ఆనందోత్సవాలతో పాటు పాలక వర్గాల ప్రమాణస్వీకారోత్సవాలు జరుగుతున్నాయి.