రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కఠిన చర్యలు

డిజిపి వైద్‌ హెచ్చరిక

శ్రీనగర్‌,జూన్‌23(జ‌నం సాక్షి): మిలిటెంట్ల అంత్యక్రియలు, ఇతర సమావేశాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై కశ్మీర్‌ పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. యువతపై తీవ్ర ప్రభావం చూపు ఇలాంటి ప్రసంగాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. దీనిపై పోలీస్‌ ఉన్నతాధికారి వైద్‌ మాట్లాడుతూ.. మిలిటెంట్ల అంత్యక్రియల్లో భాగంగా పలువురు తీవ్ర స్థాయిలో ప్రసంగాలు చేస్తారు. మరికొందరు గ్రూపు సమావేశాలు పెట్టి మరీ యువత మనసు మార్చేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్న గ్రూపులు కాస్తా పెద్ద పెద్ద జనసమూహాలు కాకముందే వాటిపై చర్యలు తీసుకోవాలి. సాధారణ యువత కూడా వారితో చేతులు కలిపే విధంగా వారి ప్రసంగాలు ఉంటాయి. ఇక ఈ సమావేశాలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచి యువతను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. దీని వల్ల ఎందరో యువకుల జీవితాలు బలైపోతున్నాయి. ఇకపై ఇలా జనం గుమిగూడే చోట పోలీసు భద్రత ఉంటుంది’ అని తెలిపారు.దిల్లీకి చెందిన మరో అధికారి మాట్లాడుతూ…’రెచ్చగొట్టే వ్యాఖ్యల అంశాలను తీవ్రంగా పరిగణించాలి. దక్షిణ కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలంటే పోలీసులు తీసుకున్న ఈ విధానాన్ని వెంటనే అమలు చేయాలని తెలిపారు.