రెడ్డీస్‌ ల్యాబ్స్‌అంజిరెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌, మార్చి 15 (జనంసాక్షి) :
ఔషధ పరిశోధనా రంగంలో భారత్‌ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రెడ్డీస్‌ ల్యాబ్స్‌ వ్యవ స్థాపకుడు డాక్టర్‌ అంజిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయనకు కూతరు, కొడకు ఉన్నారు. 1940లో గుం టూరు జిల్లా తాడేపల్లిలో అంజిరెడ్డి జన్మించిన అంజిరెడ్డి గుంటూరు ఎసి కాలేజీ నుంచి డిగ్రీ పొందారు. ఆ తరవాత పిజీ చేసి పుణె నుంచి పిహెచ్‌డి చేశారు. ఐడిపిఎల్‌ ఉద్యోగిగా జీవితం ప్రారంభించి రెడ్డీ ల్యాబ్స్‌ ఏర్పాటుతో ప్రపంచంలో ప్రముఖుడిగా గుర్తింపు పొందారు.ఔషధరంగంలో ఎన్నో శిఖరాలను అధిరోహించిన డాక్టర్‌ అంజిరెడ్డిని భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో సన్మానించింది. ప్రపంచ దిగ్గజాలతో పోటీపడి భారత ఔషధ
పరిశ్రమకు ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. పుణెలోని నేషనల్‌ కెమికల్‌ లాబొరేటరీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన అంజిరెడ్డి కొంతకాలం ఉద్యోగం చేసి ఆ తర్వాత 1976లో యూనిలాయిడ్స్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రారంభించారు. 1984లో అంతర్జాతీయ ప్రమాణాలతో రెడ్డీస్‌ ల్యాబ్స్‌ సంస్థ ప్రారంభించారు. ఈ సంస్థ భారతదేశంలోనే రెండో అతి పెద్ద ఫార్మా కంపెనీగా, ప్రపంచ ఖ్యాతిగాంచిన సంస్థగా పేరొందింది. ఇక్కడ ఇపరిశోధనలతో ఎన్నో ఔషధాలను రూపొందించి ప్రపంచానికి అందించారు. ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన వందమంది భారత సంపన్నుల జాబితాలో 64వ స్థానం పొందిన ఘనత అంజిరెడ్డిది. ఆయన స్థాపించిన నాంది ఫౌండేషన్‌ లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపడుతోంది. డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ పేరుతో రెడ్డీస్‌ ల్యాబ్స్‌కు అనుబంధంగా మరో సామాజిక సంస్థనూ ఆయన ప్రారంభించారు. అంజిరెడ్డి మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని, ముఖ్యంగా ఔషధ రంగానికి ఆయన చేసిన సేవలు ఆమోఘమని సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఆయన మృతి తెలుగువారికి లోటని చంద్నబాబు అన్నారు.