రేషన్‌ ఇంటికే చేరేలా సిఎం కేజ్రీవాల్‌ ప్రతిపాదనలు

న్యూఢిల్లీ,జూలై6(జ‌నం సాక్షి ): సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఢిల్లీ ప్రభుత్వం అభ్యంతరాలను పక్కకు నెట్టి రేషన్‌ సరుకులను ఇంటికి చేర్చే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ శుక్రవారం పేర్కొన్నారు. ప్రణాళికను వెంటనే అమలు చేయాలని ఆహార శాఖను ఆదేశించారు. ఈ ప్రతిపాదనను ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజిల్‌ తిరస్కరించి, కేంద్రం అనుమతి తీసుకురావాలని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా అభ్యంతరాలు అధిగమించి రేషన్‌ సరుకులు ఇంటికి రవాణా చేయడానికి ఆమోదించినట్లు ట్విట్టర్‌లో కేజీవ్రాల్‌ పేర్కొన్నారు. రోజువారీ పురోగతి గురించి తనకు తెలియజేయాలని మరొక ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ ప్రతిపాదనను కేంద్రం ఇప్పటికే ఆమోదించిందని, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదం కోసం ఆయనకు పంపామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. దీనిని ప్రభుత్వానికి పంపి, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని అడిగారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించవచ్చునని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కేజీవ్రాల్‌ ఈ ప్రతిపాదనకు అధికారిక ఆమోదం తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పుపై చర్చించడానికి కేజీవ్రాల్‌, సిసోడియా బైజుల్‌ను కలవనున్నారు.