*రైతులందరూ త్వరగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి*

– మునగాల మండల వ్యవసాయాధికారి బి అనిల్ కుమార్

మునగాల, సెప్టెంబర్ 22(జనంసాక్షి): ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో ఏడాదికి మూడు సార్లు జమ చేస్తుంది. ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు రూ.6వేల నగదును కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఈ పథకం అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా గతంలో కేవైసీ చేసుకున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా త్వరితగతిన ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిందని మునగాల మండల వ్యవసాయాధికారి బి అనిల్ కుమార్ తెలిపారు. గురువారం తిమ్మారెడ్డిగూడెం, కొక్కిరేణి గ్రామాలలో ఈ కేవైసీ గూర్చిన సమాచారాన్ని రైతులకు ప్రత్యక్షంగా తెలియజేశారు. ఈ కేవైసీ చేయించని రైతులకు 12 విడత పిఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాలో జమ కావని, ఈ కేవైసీ చేయించకున్నా గాని డబ్బులు పడ్డాయనే నిర్లక్ష్యాన్ని వీడాలని సూచించారు. రైతులు 31-1-2019 నాటికి పట్టదారు పాస్ పుస్తకం వచ్చి వుండి పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారందరు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవలసి వుంటుందని తెలిపారు. ఈ–కేవైసీ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే పీఎం కిసాన్ నగదు జమ కానుందని, అయితే రైతులందరూ ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న గడువులోగా పూర్తి చేసిన వాళ్లకు మాత్రమే వాళ్ల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేసిందని తెలిపారు. ఈ కేవైసీ ధ్రువీకరణను రైతులు యాప్‌ ద్వారా పీఎం కిసాన్‌ పోర్టల్‌లో ఉచితంగా చేసుకోవచ్చన్నారు. లేదంటే మీ సేవా, ఈ సేవ, ఆన్‌లైన్‌ కేంద్రాల్లో కూడా రైతులు ఈ కేవైసీ ప్రక్రియను నమోదు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నవారు www.pmkisan.gov.in వెబ్‌సైట్‌లోనూ ఈ కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయగానే ఈ–కేవైసీ అప్‌డేట్‌ వస్తుందని, దానిపై క్లిక్‌ చేసి ఆధార్‌ నంబర్‌ నమోదు చేయాలన్నారు. అప్పుడు ఆధార్‌ కార్డుకు లింకై ఉన్న సంబంధిత మొబైల్‌ ఫోన్‌కు ఓటీపీ వస్తుందని, ఓటీపీ ఎంటర్‌ చేయగానే గెట్‌ పీఎం కిసాన్‌ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలన్నారు. మళ్లీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్‌ క్లిక్‌ చేస్తే ఈ–కేవైసీ అప్‌డేట్‌ అవుతుందని మండల వ్యవసాయ అధికారి బి.అనిల్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.