రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం

దేశంలోని ప్రతిసాగుభూమికి నీరందించడమే లక్ష్యం
రైతులకోసం ఉత్తమమైన పథకాలను తీసుకొస్తాం
వీసీలో రైతులతో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ
న్యూఢిల్లీ, జూన్‌20( జ‌నం సాక్షి) : 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశవ్యాప్తంగా కొంతమంది రైతులతో ప్రధాని మోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుల అభివృద్ధి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను వారికి వివరించారు. ఎంతో కష్టపడి వ్యవసాయం సాగిస్తున్న రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేసేలా పనిచేస్తున్నామని తెలిపారు. దేశంలోని ప్రతి సాగుభూమికి నీరందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. అంతకుముందు ప్రభుత్వం వ్యవసాయానికి రూ. 1,21,000కోట్లు మాత్రమే కేటాయించిందని, కానీ మా ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేసి రూ. 2,12,000కోట్లు వ్యవసాయం కోసం కేటాయించామన్నారు. నేడు ప్రతి రైతు తమ పంటలకు బీమా చేయించుకున్నారని, పంట నష్టపోయినా రైతు నష్టపోడు అని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. రైతుల కోసం తమ ప్రభుత్వం ఉత్తమమైన పథకాలు తీసుకొస్తోందని, రైతులు కూడా సానుకూలంగా ఉండాలని ప్రధాని మోదీ కోరారు. ప్రతి దశలో రైతులకు సాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ఇక నీలి విప్లవం కింద 26శాతం అభివృద్ధిని సాధించామని.. డైరీ పరిశ్రమలోనూ 24శాతం వృద్ధి తీసుకురాగలిగామని పేర్కొన్నారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్ల కాలంలో ప్రధాని మోదీ రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడటం ఇది ఆరోసారి కావడం విశేషం.