రైతుల తలరాతలు మారాలన్నదే..

    కేసీఆర్‌ సంకల్పం    
– రైతుబంధుతో అన్నదాతల్లో సంతోషం వెల్లివిరుస్తుంది
– దమ్ముంటే కాంగ్రెస్‌ నేతలు రైతుబంధు మంచికాదని చెప్పాలి
– ఉపాధిహావిూని కేంద్రం వ్యవసాయానికి అనుసంధానం చేయాలి
– రాష్ట్ర వ్యాప్తంగా 17వేల కోట్లు రుణాలు మాఫీ చేశాం
– కేంద్రం, ఆర్బీఐ సహకారం లేకనే నాలుగు విడతలుగా చేశాం
– సమైక్యాంధ్రలో నష్టపోయింది పాలమూరు జిల్లానే
– ప్రాజెక్టుల పూర్తితో జిల్లా సస్యశ్యామలం అవుతుంది
– జిల్లాలో ఆయకట్టు లక్ష నుంచి 7లక్షల వరకు పెరిగింది
– 24గంటలు విద్యుత్‌ ఇస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానిదే
– తెలంగాణలో పథకాలను చూసి దేశంమొత్తం నివ్వెరపోతుంది
– భూత్పూర్‌లో చెక్కులు పంపిణీ లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌
మహబూబ్‌నగర్‌, మే14(జ‌నం సాక్షి) : సమైక్యాంధ్రలో ఎక్కువగా నష్టపోయింది పాలమూరు జిల్లానే అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. అందుకే పాలమూరు కషట్‌ఆలను తీర్చేందుకు ప్రాజెక్టులను పూర్తి చేసి నీరివ్వబోతున్నామని అన్నారు.  భూత్పూర్‌లో రైతులకు చెక్కుల పంపిణీ అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు. కృష్ణా నది పక్కనే పారుతున్నా.. నదీ జలాలు వాడుకోలేని పరిస్థితి ఈ జిల్లా రైతులది అని తెలిపారు. అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టును కావాలనే ఆంధ్రా పాలకులు అడ్డుకున్నారని మండిపడ్డారు.ప్రాజెక్టులను అడ్డుకొనేందుకే కాంగ్రెస్‌ నేతలు కోర్టుల్లో కేసులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసిన ప్రాజెక్టులను పూర్తిచేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రైతుల తలరాతలు మారాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమన్నారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. పాలమూరు జిల్లాలో ఆయకట్టు లక్ష నుంచి ఏడు లక్షల ఎకరాలకు పెరిగిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. దేశంలో ఏ నాయకుడికీ రాని ఆలోచన, కార్యక్రమాన్ని సీఎం చేపట్టారని తెలిపారు. రైతన్నను సంపూర్ణ మనసుతో అర్థం చేసుకొని రైతుబంధు పథకం చేపట్టారని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.  రైతులపై ప్రేమ ఉంటే రుణమాఫీని ఒకేదఫా చేసి ఉండేవారని కొందరు నేతలు అంటున్నారని.. ఒకే దఫా రుణమాఫీని అమలు చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించిందని కేటీఆర్‌ అన్నారు. కేంద్రం, ఆర్బీఐ నుంచి పూర్తి సహకారం అందక పోవటం వల్లనే నాలుగు దఫాలుగా రుణమాపీ చేయాల్సి వచ్చిందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్‌ కోసం రోడ్లెక్కాల్సి వచ్చేందని, కరెంట్‌ కోసం పాలకులు రైతులను గోసపెట్టించారన్నారు. రామరాజ్యంలో కూడా రైతులు భూమి శిస్తు కట్టారని, కానీ తెలంగాణ ప్రభుత్వ పాలనలో రైతులకే తిరిగి పైసలిచ్చే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి, రైతు జీవితం అనుభవించిన కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితే పాలన మంచిగుంటుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. 70 ఏండ్ల పాలనలో ఏ ప్రధాని, ముఖ్యమంత్రి చేయని పని కేసీఆర్‌ రైతుబంధు
రూపంలో చేస్తున్నారని కొనియాడారు. పనిచేస్తున్న ప్రభుత్వాన్ని నాలుగుకాలాలపాటు కాపాడుకుంటే మంచి ఆలోచనలతో మనం ముందుకు పోతామని, అందుకు ప్రజలు ఆశీర్వదించి అండగా నిలువాలని కోరారు. దేశంలో వస్తువులను తయారుచేసినవారే వాటి ధర నిర్ణయిస్తారని, దురదృష్టవశాత్తు రైతులకు తాము పండించిన పంటకు ధర నిర్ణయించుకునే అధికారం లేకపోవడం బాధాకరమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర నిర్ణయించాల్సింది కేంద్రమని, అది మన చేతిలో ఉంటే సీఎం కేసీఆర్‌ ఎప్పుడో అమలుచేసేవారన్నారు. మద్దతు ధర 25 శాతం పెంచాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయరంగానికి ఉపాధి హావిూని అనుసంధానం చేయాలని కేంద్రానికి నివేదించినట్లు చెప్పారు. రైతు యూనిట్‌గా పంటల బీమా ఉంటేనే న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులనే తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నదని, అందులో భాగంగానే పంట పెట్టుబడి ఇస్తున్నదని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. జూన్‌ రెండు నుంచి రూ.5లక్షల రైతు బీమా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా, పండించిన పంటకు స్వతహాగా మద్దతు ధర నిర్ణయించుకునేలా సంఘటిత శక్తిగా ఎదుగాలన్న ఉద్దేశంతోనే రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేశామన్నారు.