రైతు బీమా కింద..

సత్వర క్లెయిమ్‌ల పరిష్కారం
– ఎల్‌ఐసీ సౌత్‌ సెంట్రల్‌ జోనల్‌ మేనేజర్‌ సుశీల్‌కుమార్‌
హైదరాబాద్‌, ఆగస్టు18(జ‌నం సాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు జీవిత బీమా పథకం కింద సత్వర క్లెయిమ్‌లు పరిష్కారం చేస్తున్నట్లు జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ ప్రకటించింది. ఈనెల 14 అర్ధరాత్రి నుంచి రైతు బంధు జీవిత బీమా పథకం ప్రారంభించిన దృష్ట్యా అకాల మరణం పొందిన భూమి పట్టాదారు బాధిత కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఆన్‌లైన్‌లో సొమ్ము జమ చేస్తోంది. మృతి చెందిన సంబంధిత రైతు నామినీ పేరిట బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నట్లు ఎల్‌ఐసీ సౌత్‌ సెంట్రల్‌ జోనల్‌ మేనేజర్‌ సుశీల్‌కుమార్‌ వెల్లడించారు. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సున్న రైతు కుటుంబంలో సభ్యులైన నామినీకే ఈ లబ్ధి చేకూరుతుంది. ఈ 14నుంచి దురదృష్టవశాత్తూ ముగ్గురి జాబితాను వ్యవసాయశాఖ ధ్రువీకరించడంతో ఆ లబ్ధిదారులకు కేవలం 24 గంటల వ్యవధిలో క్లెయిమ్‌లు పరిష్కరించడం ద్వారా బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసినట్లు జోనల్‌ మేనేజర్‌ తెలిపారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఏదైనా కారణంతో రైతు మరణిస్తే 10 రోజుల వ్యవధిలో రైతు బీమా పథకం పరిహారం రూ.5 లక్షలు చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్న ఎల్‌ఐసీ రైతు బీమా పథకం అమలుకోసం ఎలక్టాన్రిక్‌ పద్ధతితో సత్వర నగదు జమ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు జోనల్‌ మేనేజర్‌ స్పష్టంచేశారు.
———————————–

తాజావార్తలు