రైల్వే బడ్జెట్‌కు రంగం సిద్ధం
మేక్‌ఇన్ ఇండియా లాంటి కీలకాంశాలకే ప్రాధాన్యం
ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలు
న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 25(జనంసాక్షి): పార్లమెంట్‌లో నేడే రైల్వే బడ్జెట్‌ను కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు ప్రవేశపెట్టనున్నారు. ఈసారైనా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కొత్త రైలు ప్రాజెక్టులు వస్తాయని, పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయిస్తుందని ఇరు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావాలంటే దాదాపు 20 వేల కోట్ల కేటాయింపులు జరగాలి. ఈసారైనా వాటికి మోక్షం కలుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన చట్టం హామీ మేరకు కొత్త జోన్ కోసం ఎదురుచూస్తుంటే, తెలంగాణ కూడా విభజన చట్టంలో ఇచ్చిన హామీలతోపాటు పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఆశగా ఎదురుచూస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాల కాలంగా నలిగిపోతున్న పెండింగ్ ప్రాజెక్టుల చిట్టా పెరిగిపోతూనే ఉంది. అయినా అరకొర నిధులే తప్ప పూర్తి స్థాయి కేటాయింపులు జరగడం లేదు. ప్రతి ఏటా దక్షిణ మధ్య రైల్వే నుంచి వేల కోట్ల రూపాయాలకు కేంద్ర ఖజానాకు వెళ్తున్నా.. ద.మ రైల్వే పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో కేంద్ర మోండిచేయి చూపుతూనే ఉంది. కేంద్ర సహకారం అందకపోవడం, రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల వందల కోట్లతో నిర్మాణం పూర్తయ్యే ప్రాజెక్టుల వ్యయం వేలకోట్లకు చేరుతోంది.
నిజానికి తెలంగాణ జిల్లాలకు రైల్వే కనెక్షన్స్ చాలా తక్కువనే చెప్పాలి, కేవలం నాలుగైదు జిల్లాలను మినాహాయిస్తే.. మిగిలిన జిల్లాలకు రోడ్డు మార్గమే ఆధారం. తెలంగాణలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే అన్ని జిల్లాలకు పూర్తి స్థాయిలో రైలు మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 9 పెండింగ్ ప్రాజెక్టులున్నాయి. 1100 కి.మి కొత్త లైన్లు వేయాల్సి ఉంది. గత మూడు దశాబ్దాలుగా మూలుగుతున్న ఈ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 5 వేల కోట్లకు పైగా కావాల్సి ఉంది.
తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు-పూర్తవడానికి కావాల్సిన నిధులు :
-1993లో అనుమతులు లభించిన పెద్దపల్లి-నిజామాబాద్‌ల మధ్య 178 కి.మి మేర చేపట్టిన రైల్వే లైను పూర్తి కావడానికి రూ. 221 కోట్లు కావాల్సి ఉంది.
-మునీరాబాద్-మహబూబ్‌నగర్‌ల మధ్య 246 కి.మిల రైల్వే లైను పూర్తి చేయడానికి రూ. 956 కోట్లు కావాల్సి ఉంది.
-గద్వాల-రాయచూర్‌ల మధ్య 58.8 కి.మిల రైల్వే లైను పూర్తి చేయడానికి రూ. 290 కోట్లు కావాల్సి ఉంది.
-విష్ణుపురం-జహన్ పహాడ్‌ల మధ్య 11 కి.మిల రైల్వే లైను పూర్తి చేయడానికి రూ. 57.9 కోట్లు కావాల్సి ఉంది.
-మనోహరాబాద్-కొత్తపల్లిల మధ్య 148.9 కి.మిల రైల్వే లైను పూర్తి చేయడానికి రూ. 943 కోట్లు కావాల్సి ఉంది.
-భద్రాచలం రోడ్-సత్తుపల్లిల మధ్య 56.25 కి.మిల రైల్వే లైను పూర్తి చేయడానికి రూ. 312 కోట్లు కావాల్సిఉంది.
-భద్రాచలం రోడ్-కొవ్వూరుల మధ్య 151 కి.మిల రైల్వే లైను పూర్తి చేయడానికి రూ. 912 కోట్లు కావాల్సి ఉంది.
-అక్కన్నపేట-మెదక్‌ల మధ్య 17.20 కి.మిల రైల్వే లైను పూర్తి చేయడానికి రూ. 108 కోట్లు కావాల్సి ఉంది.
-2013 బడ్జెట్‌లో ప్రకటించిన మణుగూరు-రామగుండంల మధ్య 200 కి.మి కి.మిల రైల్వే లైను పూర్తి చేయడానికి రూ. 1109 కోట్లు కావాల్సి ఉంది.
-కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి 20 ఏళ్ల క్రిందట ప్రారంభించిన కరీంనగర్-నిజామాబాద్ లైను నేటికీ పూర్తి కాలేదు. నిధులు మంజూరు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఈ లైను ఇంకా ముందుకు సాగడం లేదు. ఇదిలాఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తో పాటు ఆయన స్వస్థలమైన సిద్ధిపేటకు కూడా రైల్వే లైను లేదు. ఈ సారైనా సికింద్రాబాద్ నుంచి కరీంనగర్‌కు రైల్వే లైను వేయాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. అంతేకాక కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రక్రియ కూడా ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. కాజీపేటను రైల్వే జోన్ చేయాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ పెండింగ్ ప్రాజెక్టుల లీస్ట్ చాంతాడంత ఉంది. గత 15 ఏళ్లుగా ఏపీలో రైల్వే ప్రాజెక్టు పరిస్థితి ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. దాదాపు 1200 కి.మి మేర వేయాల్సిన లైన్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిని పూర్తి చేయాలంటే సుమారు రూ. 10 వేల కోట్లు కావాల్సి ఉన్నాయి.
ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులు- పూర్తవడానికి కావాల్సిన నిధులు :
-1996లో అనుమతి పొందిన నంద్యాల-ఎర్రగుంట్ల 120 కి.మి రైల్వే లైను నేటికీ నిర్మాణం జరుగుతూనే ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ. 110 కోట్లు కావాల్సి ఉంది.
-మాచర్ల-నల్గొండల మధ్య 81 కి.మిల రైల్వే లైను పూర్తి చేయడానికి రూ. 442 కోట్లు
-కాకినాడ-పిఠాపురంల మధ్య 21 కి.మిల రైల్వే లైను పూర్తి చేయడానికి రూ. 213 కోట్లు
-కోటిపల్లి-నర్సాపురంల మధ్య 57 కి.మిల రైల్వే లైను పూర్తి చేయడానికి రూ. 1025 కోట్లు
-జగ్గయ్యపేట-మేళ్ల చెరువుల మధ్య 19.1 కి.మిల రైల్వే లైను పూర్తి చేయడానికి రూ. 92 కోట్లు
-కడప-బెంగళూరు చెరువుల మధ్య 255 కి.మిల రైల్వే లైను పూర్తి చేయడానికి 1835 కోట్లు
-గూడురు-దుర్గరాజపట్నంల మధ్య 42 కి.మిల రైల్వే లైను పూర్తి చేయడానికి రూ. 272 కోట్లు
-నడికుడి-శ్రీకాళహస్తిల మధ్య 309 కి.మిల రైల్వే లైను పూర్తి చేయడానికి రూ. 1301 కోట్లు
-కంభం-ప్రొద్దుటూరుల మధ్య 142 కి.మిల రైల్వే లైను పూర్తి చేయడానికి రూ. 829 కోట్లు
-కొండపల్లి-కొత్తగూడెంల మధ్య 125 కి.మిల రైల్వే లైను పూర్తి చేయడానికి రూ. 611 కోట్లు కావాల్సి ఉంది.
ఏపీలో ప్రస్థుతం పది కొత్త రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోంది. 1172 కి.మిల పొడవున చేపడుతున్న ఈ లైన్లకు 8041 కోట్ల నిధులు అవసరమని అంచనా వేస్తున్నారు. గత 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ లైన్లకు అరకొర కేటాయింపులే జరిగాయి. దీంతో ఇప్పటి వరకూ 25 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. గత బడ్జెట్‌లో ఈ లైన్ల నిర్మాణం కోసం 280 కోట్లను మాత్రమే కేంద్రం కేటాయించింది. ఇలా వేల కోట్లు కవాల్సిన తరుణంలో వంద, రెండు వందల కోట్లు కేటాయించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయా లేవా అనే అనుమానాలూ తలెత్తుతున్నాయి. ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు సరైన శ్రద్ధ వహించకపోవడంతోనే రైల్వే కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఏపీలో సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉండడంతో మొత్తం 13 పోర్టులను అనుసంధానం చేస్తూ ప్రత్యేక రైల్వే కారిడార్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ కారిడార్‌లో రైల్వే లైను నిర్మించడం ద్వారా సరకు రవాణా చేయవచ్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి నివేదిక అందించారు. దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.