రైల్‌లో మహిళల భద్రత కోసం..

పానిక్‌ బటన్స్‌
లక్నో, మే16(జ‌నం సాక్షి) : మహిళా ప్రయాణికుల భద్రతపై రైల్వేలు ప్రత్యేక దృష్టి సారించాయి. నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వే(ఎన్‌ఇఆర్‌) సంస్థ రాత్రిపూట రైళ్లలో ప్రయాణించే మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా పోలీసులను నియమించాలని, అలాగే కోచ్‌లలో పానిక్‌ బటన్స్‌ను పెట్టాలని నిర్ణయించారు. ఈ ఏడాది మహిళలు, పిల్లల భద్రతపై దృష్టి పెట్టిన రైల్వేసంస్థ ఈ ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఎన్‌ఇఆర్‌ చీఫ్‌ పిఆర్‌ఒ సంజరు యాదవ్‌ విూడియాకు వెల్లడించారు. రాత్రి సమయాలలో సబర్బన్‌ రైళ్లలో మహిళా పోలీసు సిబ్బందిని విస్తరింపజేయాలని, ఆర్‌పిఎఫ్‌లో కూడా మహిళలను నియమించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రతకోసం కోచ్‌లలో ‘పానిక్‌ బటన్స్‌లను ఏర్పాటు చేసి వాటిని గార్డ్‌ కోచ్‌లకు అనుసంధానిస్తారని తెలిపారు. ఒంటరిగా ఉన్న మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే ఈ ‘పానిక్‌ బటన్స్‌ను (ఎలక్టాన్రిక్‌ స్విచ్‌లు రూపంలో ఉండే ) నొక్కగానే రైల్వే సిబ్బంది వెంటనే చేరుకుంటారన్నారు. అత్యవసర పరిస్థితులలో మహిళలు హెల్ప్‌లైన్‌ నెంబర్లకు కాల్‌ చేయడం, ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపడం, చైన్‌లు లాగడం వంటివి చేస్తున్నారని, వీటి వల్ల సత్వర చర్యలు తీసుకోవడానికి ఆలస్యమవుతోందని, ఈ పథకం ద్వారా వెంటనే సహాయం అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.