రోహింగ్యాలపై కన్నేసి ఉంచాం
వారు ఓటేయడానికి వస్తే అరెస్ట్ చేస్తాం
జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్
హైదరాబాద్,డిసెంబర్6(జనంసాక్షి): అక్రమంగా ఓటరు కార్డులు పొందిన రోహింగ్యాలపై నిఘా ఉంచామని జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిషోర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో 105 మంది రోహింగ్యాలు నకిలీ ధ్రువపత్రాలతో ఓటరు గుర్తింపుకార్డులు పొందినట్లు గుర్తించామన్నారు. వారంతా మయన్మార్ దేశం నుంచి శరణార్థులుగా నగరానికి వచ్చారని, చట్ట ప్రకారం వారికి ఎలాంటి ప్రభుత్వ గుర్తింపుకార్డులు పొందే అర్హత లేదన్నారు. ఓటు వేసేందుకు రాగానే వాళ్లని గుర్తించి అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ వద్ద ఉన్న సమాచారం ప్రకారం నాంపల్లి నియోజకవర్గంలో 13, కార్వాన్లో 1, మలక్‌పేట్‌లో 1, చాంద్రాయణగుట్టలో 56, యాఖుత్‌పురాలో 5, బహదూర్‌పురాలో 29 మంది రోహింగ్యాలు ఓటరు గుర్తింపుకార్డులు పొందారని వివరించారు. ఇకపోతే
హైదరాబాద్ జిల్లాలో దివ్యాంగ ఓటర్ల సౌకర్యా ర్థం పోలింగ్ కేంద్రం వరకు ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు వారికి సహాయకులుగా దాదాపు 3 వేల మంది వాలంటీర్లను నియమిస్తున్నట్లు దానకిషోర్ తెలిపారు. పోలింగ్‌కు వచ్చే దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు, అన్ని పోలింగ్ స్టేషన్లలో ర్యాంప్‌ల నిర్మాణం, పోలింగ్ లోకేషన్లలో వీల్ చైర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి వాలంటీర్ తప్పనిసరిగా ఎన్నికల విధులకు సంబంధించిన టీ షర్ట్ ధరించాలని, దివ్యాంగులు, శారీరకంగా అశక్తులైన వారిని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లేటప్పుడు టేబుల్-1, పీఓ. ఏపీఓల మద్దతు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో దివ్యాంగుల ఓటర్ల సంఖ్య, ప్రతి గంటకు ఓటును వినియోగించుకున్న వారి సంఖ్య తదితర వివరాలను కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని సూచించారు.